
- పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రులు సురేఖ, శ్రీధర్ బాబు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: సరస్వతీ పుష్కరాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు మంత్రి కొండా సురేఖ, శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సెక్రటేరియెట్ లోని మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ మాట్లాడుతూ.. ఈ నెల 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు కాళేశ్వరంలో పుష్కరాలు జరగనున్నాయని తెలిపారు. త్రివేణి సంగమ స్నానానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిపారు.
ఈ నెల 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభమవుతుందని.. అప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కావాలని ఆఫీసర్లను ఆదేశించారు. పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, ఎండోమెంట్ కమిషనర్ వెంకటరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర శాఖల ఉన్నతాధికారులు, ఆలయ ఈఓ మహేశ్ పాల్గొన్నారు.
సీఎంకు ఇన్విటేషన్ అందజేసిన మంత్రి సురేఖ
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సరస్వతి పుష్కరాలకు అటెండ్ కావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, కమిషనర్ వెంకట్రావు, పురోహితులు పాల్గొన్నారు.