సారథి పోర్టల్ విస్తరణకు కసరత్తు

సారథి పోర్టల్ విస్తరణకు కసరత్తు
  • 25 న ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ప్రారంభానికి ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పోర్టల్ 'సారథి'ని రాష్ట్రమంతా విస్తరించే పనిలో ఆర్టీఏ అధికారులు ఉన్నారు. రెండు నెలల క్రితం ఈ పోర్టల్ ను సికింద్రాబాద్ లోని తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో ప్రయోగాత్మకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దాని ద్వారా ప్రజలకు ఆన్ లైన్ లో  మెరుగైన సేవలు అందుతున్నాయి. దీంతో ఈ పోర్టల్ ను ఇప్పుడు ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు  చేస్తున్నారు.   ఈ నెల 25 న ఇక్కడ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ తర్వాత దీన్ని అన్ని జిల్లాల్లో, సిటీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంపై దృష్టి పెట్టారు. ఈ పోర్టల్ ద్వారా ఆర్టీఏకు సంబంధించిన సుమారు 20 వరకు సేవలు పౌరులకు అందుబాటులో ఉన్నాయి. 

దీంతో ఆర్టీఏ ఆఫీసుకు వచ్చి వారి పనుల కోసం రోజుల తరబడి తిరిగే అవసరం లేదు. ఇంతకు ముందు కూడా ఆర్టీఏ అధికారులు ఆన్  లైన్ సేవలను అందుబాటులో ఉంచినా..పలు సాంకేతిక సమస్యలతో ప్రజలకు చికాకు తెప్పించాయి. అయితే,సారథి పోర్టల్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందున ఆన్ లైన్ సేవలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుతున్నాయి. అందుకే సారథి పోర్టల్ ను రాష్ట్రమంతటా విస్తరించే పనిలో ఆర్టీఏ అధికారులు ఉన్నారు. ఏసీబీ దాడులతో ఆర్టీఏ ప్రతిష్ట మసకబారుతున్న సమయంలో, దాని నుంచి బయటపడేందుకు ఈ పోర్టల్ ను పూర్తి స్థాయిలో అమలు చేయడమే మేలనే భావనలో ఆర్టీఏ అధికారులు ఉన్నారు.