
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి జాతీయ సెలక్టర్లకు సవాలు విసిరాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో సర్ఫరాజ్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. జట్టులో ఉండడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సెలక్టర్లు ఈ ముంబై కుర్రాడిని పట్టించుకోలేదు. ఆ తర్వాత తన ఫిట్ నెస్ పై ఫోకస్ చేసి కేవలం రెండు నెలల్లోనే 17 కిలోల శరీర బరువు తగ్గి స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్ తో కనిపించి ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్ లో సెంచరీ కొట్టి సత్తా చాటి భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించే పనిలో ఉన్నాడు.
ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా బుచ్చి బాబు టోర్నమెంట్ సోమవారం (ఆగస్టు 18) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. గోజన్ కాలేజ్ ఎ గ్రౌండ్‌లో ముంబై తరపున ఆడుతున్న సర్ఫరాజ్.. TNCAపై 92 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. 98 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ముంబై జట్టును తన సెంచరీతో ఆదుకున్నాడు. వన్డే రీతిలో చెలరేగుతూ అలవోకగా బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్ గా 138 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరాడు. సర్ఫరాజ్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లతో పాటు 6 సిక్సర్లు ఉన్నాయి. సర్ఫరాజ్ సెంచరీతో ప్రస్తుతం ముంబై తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
ALSO READ : టీమిండియా నెక్స్ట్ హెడ్ కోచ్ అతడే..
సర్ఫరాజ్ తన చివరి టెస్టును గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XIతో ఆడాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సర్ఫరాజ్ ఎంపికైనా ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. దీనికి తోడు గాయం కారణంగా 2024-25 రంజీ ట్రోఫీకి దూరమయ్యాడు. 2024 ఫిబ్రవరి 15 రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే రెండు ఇన్నింగ్స్ ల్లో హాఫ్ సెంచరీలు చేసి సత్తా చాటాడు. ఓవరాల్ గా ఆరు టెస్టుల్లో ఇండియా తరపున 371 పరుగులు చేశాడు.