నామినేషన్లు షురూ..తొలిరోజు సర్పంచ్‌‌ పదవులకు 3వేలకు పైనే

నామినేషన్లు షురూ..తొలిరోజు సర్పంచ్‌‌ పదవులకు 3వేలకు పైనే
  • వార్డు మెంబర్ పోస్టులకు 1,821
  • అత్యధికంగా నల్గొండ జిల్లాలో 421 సర్పంచ్ నామినేషన్లు
  • 4,236 సర్పంచ్‌‌‌‌ పదవులకు 3,242 నామినేషన్లు దాఖలు
  • అత్యధికంగా నల్గొండ జిల్లాలో 421 

హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో మొత్తం 4,236 సర్పంచ్‌‌‌‌ పదవులకు ఎన్నికలు జరగనుండగా.. తొలిరోజు 3,242 నామినేషన్లు, 37,440 వార్డు స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత నామినేషన్లకు శనివారం చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లాలో 318 సర్పంచ్‌‌‌‌ స్థానాలకు అత్యధికంగా 421 నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి జిల్లాలో 153 స్థానాలకు 209, సూర్యాపేట జిల్లాలో 159 స్థానాలకు 207, వరంగల్‌‌‌‌లో 91 స్థానాలకు 101, సంగారెడ్డిలో 136 స్థానాలకు 147, జనగామ జిల్లాలో 110 స్థానాలకు 108 నామినేషన్లు వచ్చాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలో 114 సర్పంచ్‌‌‌‌ పదవులకు 15 మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. 

ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో 166 స్థానాలకు 32, మెదక్‌‌‌‌ జిల్లాలో 160 స్థానాలకు 55, మంచిర్యాలలో 90 స్థానాలకు 25, జగిత్యాలలో 122 స్థానాలకు 48, భద్రాద్రి కొత్తగూడెంలో 159 పదవులకు 83, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 స్థానాలకు 42, ములుగు జిల్లాలో 48 స్థానాలకు 22, కామారెడ్డిలో 167 స్థానాలకు 115 నామినేషన్లు వచ్చాయి. 

ఇంకా రెండ్రోజులే గడువు.. 

ఓటర్ల జాబితాలను గ్రామ పంచాయతీల్లోని నోటీస్‌‌‌‌ బోర్డులపై రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్లు ప్రచురించారు. 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యల స్థానాలకు నోటీసులు ఇవ్వడంతో ఉదయం 10.30 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. 

నామినేషన్ల దాఖలుకు ఇంకా రెండ్రోజులే ఉండడంతో అభ్యర్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు, పీఆర్ అండ్ ఆర్డీ శాఖ కమిషనరేట్‌‌‌‌లో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేశారు. ముగ్గురు సూపరిండెంటెంట్ స్థాయి అధికారులతో ఈ సెల్‌‌‌‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలైనందున లీగల్ సెల్‌‌‌‌ను ఈసీ ఏర్పాటు చేసింది. ఎన్నికలు ప్రక్రియకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేలా వీటి ద్వారా జిల్లాలతో సమన్వయం చేయనుంది. 

టీ-పోల్‌‌‌‌ మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌లో ఓటర్‌‌‌‌‌‌‌‌ స్లిప్స్‌‌‌‌.. 

రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సేవలను మరింత సులభతరం చేసేందుకు టీ-పోల్‌‌‌‌ (Te -poll) అనే కొత్త మొబైల్‌‌‌‌ యాప్‌‌‌‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం విడుదల చేసింది. ఈ యాప్‌‌‌‌ ప్రస్తుతం ప్లే స్టోర్‌‌‌‌లో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఓటర్‌‌‌‌ స్లిప్‌‌‌‌ డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకోవడం, పోలింగ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ ఎక్కడుందో తెలుసుకోవడం, సమస్యలపై ఫిర్యాదు చేయడం, ఫిర్యాదుల పరిష్కార ప్రగతిని (ట్రాకింగ్‌‌‌‌) తెలుసుకునేందుకు ఈ యాప్‌‌‌‌ ఉపయోగపడుతుందని ఎస్ఈసీ కార్యదర్శి మందా మకరంద్‌‌‌‌ తెలిపారు.