వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఆస్థి కోసం కన్న తండ్రి, పినతల్లి కుటుంబంపై అనార్ సింగ్ చేసిన పెట్రోల్ దాడిలో ఒకేరోజు రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో వెంకటేష్ మృతి చెందగా... దాడిలో గాయపడ్డ వెంకటేష్ తల్లి రమణిబాయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కొడుకు అంత్యక్రియలు పూర్తైన వెంటనే తల్లి అంత్యక్రియలు జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆస్థి కోసం జరిగిన ఈ దాడిలో రమణిబాయ్ కుటుంబం చిన్నాభిన్నం అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు అనార్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మంగళవారం (మార్చి 24) రూప్ సింగ్ తాండా సర్పంచ్ రమణి భాయ్ కుటుంబంపై హత్యాయత్నం జరిగింది.
►ALSO READ | సిద్దిపేట జిల్లాలో విషాదం... మల్లన్న సాగర్ కెనాల్ లో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి...
తెల్లవారుజామున ఇంటి పైకప్పు నుంచి పెట్రోల్ పోసి నిప్పంటించాడు అనార్ సింగ్ అనే వ్యక్తి. నిద్రలో ఉన్న సమయంలో నిప్పంటించడంతో.. పడుకున్న చోటే సర్పంచ్ రమణి భాయ్, భర్త హన్మంత్ నాయక్, కుమారుడు వెంకటేష్ లకు నిప్పంటుకొని తీవ్ర గాయాలపాలయ్యారు.
తీవ్రంగా గాయపడ్డ తల్లి, కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మరో కుమారుడు శివకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలే దాడికి కారణంగా తెలుస్తోంది.
