రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ల తిరుగుబాటు

రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ల తిరుగుబాటు

రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్ లు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే గ్రామాల్లో ప్రల్లెప్రగతి కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఇటు అధికార పార్టీ సర్పంచ్ లు కూడా నిరసనల్లో పాల్గొంటున్నారు. లక్షలకు లక్షలు అప్పులు చేసి.. గత పల్లెప్రగతిలో  పనులు చేయిస్తే.. ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా తమను వేధిస్తోందని సర్పంచ్ లు వాపోయారు. మిత్తీలు పెరిగిపోయి కొంత మంది సర్పంచ్ లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని  ఆరోపిస్తున్నారు. పెండింగ్ డబ్బులను చెల్లించనిది ఐదో విడత పల్లెప్రగతి పనులు ఎలా చేయిస్తామని నిలదీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పల్లెప్రగతి కార్యక్రమంపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్న అధికారులకు సర్పంచ్ ల నిరసన సెగ తగులుతోంది. సమావేశంలోనే MPDOలను గట్టిగా నిలదీస్తున్నారు. రాజీనామాలైనా చేస్తాం.. మాకీ పదవులు వద్దూ అంటూ సర్పంచ్ లు తేల్చి చెప్తున్నారు. 

గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 6 నుంచి అక్టోబర్ 5 వరకు 30 రోజులు పల్లెప్రగతి నిర్వహించింది.  రెండో విడత 2020 జనవరి 2 నుంచి 10 రోజుల పాటు కొనసాగింది. మూడో విడత 2020 జూన్ 1 నుంచి ఎనిమిదిరోజులు కొనసాగింది. నాలుగో విడత 2021 జులై 1 నుంచి 10 రోజులు కొనసాగింది. అయితే పల్లెప్రగతి ఉన్న ప్రతీ సారి సర్పంచ్ లు బయట అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులు జరిగిన తర్వాతే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. దీంతో సర్పంచ్ లు మిత్తీలకు అప్పు తెచ్చి పనులు చేయించారు. ఇప్పటి వరకు ఆ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో సర్పంచ్ లపై భారం పడింది. చేసిన పనులకు రావాల్సిన డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అనేక సార్లు అధికారులు, ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నారు అయినా ఫలితం రాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15 కమిషన్ నిధులను కూడా గ్రామ పంచాయతీలు వాడుకోకుండా ప్రీజింగ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పల్లెప్రగతిని బైకాట్ చేస్తామని సర్పంచ్ లు హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 12  వేల 769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాదాపు అన్ని గ్రామాల్లో సర్పంచ్ లు ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు, రైతువేదికలు తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. పంచాయతీ అకౌంట్లలో పైసలు ఉన్నప్పటికీ వాటిని ప్రభుత్వం ఫ్రీజింగ్ చేసింది. దీంతో సర్పంచ్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆస్తులు తాకట్టు పెట్టి సర్పంచ్ లు పనులు చేయించారు. ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులు రిలీజ్ కాకపోవడంతో పుస్తెల తాడు అమ్మి.. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టామని సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఈ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. సర్పంచ్ ల న్యాయబద్ధమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు ఇస్తామని బండి సంజయ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. టీఆర్ఎస్ పాలనలో పల్లెల్లో సమస్యలు పెరిగాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. పుస్తెలు అమ్మి వడ్డీ కట్టాల్సిన పరిస్థితి తెచ్చారని ఫైర్ అయ్యారు.

ఇటు మహబూబాబాద్ MPDO కార్యాలయం ముందు సర్పంచ్లు నిరసన వ్యక్తం చేశారు. పల్లెప్రగతి కోసం అప్పులు తెచ్చి పనులు చేయిస్తే.. ఇప్పటి వరకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే  తామంతా మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప ..చేసేదేమీ లేదని అన్నారు. మూడేండ్ల నుంచి అనేక సార్లు ఆధికారులకు, మంత్రులకు ఎమ్మెల్యే లకు మొరపెట్టుకున్నా..పట్టించుకోవడం లేదని అరోపించారు. ఎల్లుండి నుంచి జరిగే 5 విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి ముందే పెండింగ్ బిల్లులు మంజారు చేయాలని లేకపోతే..పనులుచేయబోమని సర్పంచ్ లు హెచ్చరించారు. మహబూబాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాన్ని అధికార పార్టీ సర్పంచ్ లుకు బహిష్కరించారు.

మంచిర్యాల జిల్లా సర్పంచ్ లు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పల్లెప్రగతిని బహిష్కరిస్తామని హెచ్చరించారు. లక్షల్లో అప్పులు తెచ్చి పనులు చేస్తే ఏడాది కావస్తున్నా బిల్లులు రాకపోవడంతో పార్టీలకు అతీతంగా సర్పంచ్ లు నిరసనలకు దిగుతున్నారు. బిల్లులు ఇయ్యకుంటే ఐదో విడత పల్లెప్రగతిలో పాల్గొనబోమని మంచిర్యాల జిల్లా సర్పంచ్ లు మూకుమ్మడి ప్రకటన చేశారు. 

ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్లోనే సర్పంచ్ ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. పల్లె ప్రగతి సన్నాహక సమావేశాలను సర్పంచ్ లు బహిష్కరిస్తున్నారు.అప్పులు తెచ్చి గ్రామాల్లో పనులు చేయిస్తే.. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా వేధిస్తోందని సర్పంచ్ లు ఆరోపించారు. నెలనెలా వేలకు వేలు మిత్తీలు కట్టుకుంటూ పోతే.. ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. నాలుగో విడత పల్లె ప్రగతి బిల్లులను చెల్లించకుండా..ఐదో విడత పల్లెప్రగతి పనులు ఎలా చేపడుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బిల్లులు చెల్లించకుంటే పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనబోమని సర్పంచ్ ల ఫోరం తేల్చి చెప్పింది.

ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో సర్పంచ్ లు పల్లెప్రగతి సన్నాహక సమావేశాలను బహిష్కరించారు. ఉప్పునుంతల మండల కేంద్రంలో ఎంపీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ లు నిరసన వ్యక్తం చేశారు. గతంలో పనులు చేయించి ఇప్పటికే అప్పుల పాలయ్యామని.. కొత్తగా అప్పులు చేసే స్తోమత తమకు లేదని సర్పంచ్ లు ప్రకటించారు. ముందుగా బిల్లులు చెల్లిస్తేనే పల్లె ప్రగతి పనులు చేయిస్తామని చెప్పారు. చాలా మంది సర్పంచ్ లు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కల్లు తెరిచి పెండింగ్ బిల్లులతో పాటు.. సర్పంచ్ ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.