పెండింగ్​ బిల్లులిస్తేనే పల్లె ప్రగతి

పెండింగ్​ బిల్లులిస్తేనే పల్లె ప్రగతి

వెలుగు నెట్​వర్క్: గతంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను  సర్కారు చెల్లించేదాకా పల్లెప్రగతి పనులు చేసే ప్రసక్తే లేదని సర్పంచులు మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో మంగళవారం నిర్వహించిన పల్లె ప్రగతి సన్నాహక సమావేశాలను సర్పంచులు బైకాట్​ చేసి నిరసన వ్యక్తం చేశారు. పలుచోట్ల మెజార్టీ సర్పంచులు రాకున్నా.. మొక్కుబడిగా మీటింగ్​ నిర్వహించారు. కరీంనగర్​ జిల్లా ఇల్లందకుంటలో 15 గ్రామాల సర్పంచులు గైర్హాజరయ్యారు. కేవలం మూడు గ్రామాల సర్పంచులు మాత్రమే హాజరయ్యారు. గన్నేరువరం మండల పరిషత్ ఆఫీసులో ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశానికి కేవలం అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఒక్క సర్పంచ్ కూడా రాలేదు. వీణవంక మండలంలోనూ ఇదే పరిస్థితి. సర్పంచులెవరూ సదస్సుకు హాజరు కాలేదు. గంగాధర మండల పరిషత్ ఆఫీసులో నిర్వహించిన పల్లె ప్రగతి అవగాహన సదస్సును సర్పంచులు బైకాట్​ చేశారు. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని, ఐదో విడత పల్లె ప్రగతికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు లేకుండానే అధికారులతో సదస్సు నిర్వహించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోనూ సర్పంచులు ఆందోళనకు దిగారు. ఎంపీడీఓ రవీందర్ రెడ్డి  బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమావేశాన్ని నిర్వహించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో కలెక్టర్​ వీడియో కాన్ఫరెన్స్​ను సర్పంచులు బైకాట్​చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​లో 27 మంది సర్పంచులకు 12 మంది, ఇద్దరు ఎంపీటీసీలు హాజరయ్యారు. కనుకుల సర్పంచ్ అంజయ్యతోపాటు పలువురు బిల్లులు చెల్లించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పనులు వార్డు మెంబర్లకు అప్పగించవచ్చు కదా అని ఎంపీపీ వ్యాఖ్యానించారు. ఆర్థిక భారాన్ని సర్పంచులే తట్టుకోలేకపోతున్నారని, వార్డుసభ్యులతో ఎలా సాధ్యమవుతుందని అంజయ్య ప్రశ్నించారు. ఐదో విడత పల్లె ప్రగతికి ఖర్చయ్యే మొత్తాన్ని ముందుగానే ఇవ్వాలంటూ సర్పంచులు రాజు, బాపురెడ్డి, అంజయ్య, అనిత, లావణ్య, స్వరూప, శ్రీనివాస్, స్వప్న, రవీందర్ రెడ్డి, దేవమ్మ, వసంత, వెంకటలక్ష్మి తదితరులు ఎంపీపీ బాలాజీరావుకు వినతిపత్రం అందజేశారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం, నడిగూడెంలో పల్లె ప్రగతి సన్నాహక సమావేశాన్ని సర్పంచులు బహిష్కరించారు. నడిగూడెం మండలంలో మండల పరిషత్ ఆఫీస్ ఎదుట నిలబడి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని.. లేదంటే పల్లె ప్రగతిని బహిష్కరిస్తామని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. హనుమకొండ​జిల్లా నడికూడ మండలంలో 14 మంది సర్పంచులకు ఐదుగురు, దంతాలపల్లి మండలంలో 17 మంది సర్పంచులకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. నల్లబెల్లి మండలం, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలం, బిజినేపల్లి, నాగర్​కర్నూల్, కల్వకుర్తి, బల్మూరు, దేవరకద్ర, ఉండవెల్లి మండలాల్లో సమావేశాలను బైకాట్​ చేశారు.  

ఆఫీసర్ల నిలదీత

గత పల్లె ప్రగతిలో చేసిన పనుల బకాయిలు ఇంతవరకు రాలేదని, కొత్తగా మళ్లీ పనులు ఎలా చేయాలంటూ పలువురు సర్పంచులు ఆఫీసర్లను నిలదీశారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు ఎంపీడీఓ ఆఫీస్ లో నిర్వహించిన పల్లె ప్రగతి సన్నాహక సమావేశానికి 14 మంది సర్పంచులకు కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా చేయాల్సిన పనుల వివరాలను ఆఫీసర్లు వివరిస్తుండగా కందిబండ సర్పంచ్ అబ్రహం కలగజేసుకున్నారు. పెండింగ్ బిల్లులు ఇంతవరకు రాలేదని, ఇప్పుడు కొత్త పనులు ఎట్లా చేయాలో చెప్పాలని ఆఫీసర్లను నిలదీశారు. సొంత డబ్బులు పెట్టి పనులు చేయించే స్థితిలో లేమని ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన సర్పంచులూ ఆయనతో గొంతు కలిపారు.హేమ్లా తండా సర్పంచ్ బిక్షం, ఎర్రగట్టు సర్పంచ్ పద్మ పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు.

మా ఎమ్మెల్యే ఎక్కడ?

గెలిచి మూడేళ్లు గడిచినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేను కలవలేదని, ఫండ్స్​లేక.. బిల్లులు రాక గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్​జిల్లా తూప్రాన్​మండలానికి(సీఎం నియోజకవర్గం) చెందిన సర్పంచులు మంగళవారం పల్లె ప్రగతి సన్నాహక సమావేశాన్ని బైకాట్​చేశారు. ఎంపీడీఓ ఆఫీసు ముందు టీఆర్ఎస్​ సర్పంచులు 12 మంది మా ఎమ్మెల్యే ఎవరు.. మా ఎమ్మెల్యే ఎక్కడ అంటూ ప్లకార్డులు చేతిలో పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారని, వారికి సమాధానం చెప్పలేక మొఖం చాటు చేసుకుని తిరుగుతున్నామని వాపోయారు. 

రూ. వెయ్యితో ఎలా చేసేది? 

మా జీపీలో జనరల్​ ఫండ్ రూ.17,078, స్టేట్​ఫైనాన్స్​ఫండ్​రూ.5,211, సెంట్రల్​ ఫైనాన్స్​ఫండ్​ రూ.31,816.. మొత్తం రూ.54,105 ఉన్నయ్. ఇందులోంచి ట్రాక్టర్​ఈఎంఐ రూ.16 వేలు, సిబ్బంది జీతాలు రూ.17 వేలు, కరెంటు బిల్లులు రూ.20 వేలు పోగా మిగిలిన రూ.వెయ్యితో 15 రోజులపాటు పల్లెప్రగతి పనులు ఎలా చెయ్యాలె. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్​ఫండ్​ఇస్తేనే గ్రామాల్లో డెవలప్​మెంట్​వర్క్స్​చేయగలుగుతాం. 
– హన్మంతరెడ్డి, సర్పంచ్​, చిన్న ఆచంపల్లి, కరీంనగర్​

దత్తత తీసుకోండి

వరంగల్​ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన పల్లె ప్రగతి సన్నాహక సమావేశంలో రాగన్నగూడెం గ్రామ  సర్పంచి రెంటాల గోవర్ధన్​రెడ్డి మాట్లాడుతూ గత పల్లె ప్రగతిలో చేసిన పనుల బిల్లులు ఇప్పటికీ రాలేదన్నారు. చిన్న గ్రామ పంచాయతీల్లో నిధులు లేవని, ప్రస్తుతం పల్లె ప్రగతి పనులు చేయడం కష్టమని చెప్పారు. ఎవరైనా దత్తత తీసుకుంటే ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయని, అప్పుడు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. 

ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా మళ్లీ పల్లెప్రగతి చేపడుతుం డడంపై సర్పంచులు భగ్గుమన్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి సన్నాహక సమావేశాలను బాయ్​కాట్​చేశారు. పల్లె ప్రగతికి ముందే తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ఐదో విడత పల్లె ప్రగతికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు. కొన్ని చోట్ల సమావేశాలను బహిష్కరించారు.