మా ప్రభుత్వంతోనే ఇబ్బందులు పడుతున్నం

మా ప్రభుత్వంతోనే ఇబ్బందులు పడుతున్నం
  • నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్  సర్పంచ్​ ఆడియో వైరల్​
  • సీఎం సారును మీటింగ్​కు పిలువున్రి.. పైసలడుగుతా
  • కొండపాక మండల పరిషత్​ మీటింగులో సర్పంచ్​ భర్త
  • ఏకగ్రీవ పంచాయతీలపై కేసీఆర్​ మాట మార్చినందుకు
  • నిరసనగా రాజీనామా చేస్తామన్న మరో సర్పంచ్ 

రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్​ తీరుపై సొంత పార్టీ టీఆర్ఎస్​కు చెందిన సర్పంచులే మండిపడ్డారు. పనులు చేయించుకొని బిల్లులు ఇస్తలేరని, తమ ఎమ్మెల్యే నంబర్​వన్​ దొంగలా మారి, తమను పట్టించుకుంటలేడని నల్గొండ జిల్లాలో ఓ సర్పంచ్​ అన్న ఆడియో వైరల్​కాగా,  గజ్వేల్​ మండల పరిషత్​మీటింగులో ఓ సర్పంచ్​ భర్త, వచ్చే సమావేశానికి సీఎం సారును పిలవాలని ఎంపీపీని, ఆఫీసర్లను కోరాడు. తమ ఎమ్మెల్యే కూడా అయిన కేసీఆర్​ వస్తే పెండింగ్​ బిల్లులు వసూలు చేసుకుంటానని చెప్పాడు. కాగా, ఏకగ్రీవపంచాయతీలకు పైసలియ్యమని మాటమార్చిన సీఎం తీరుకు నిరసనగా రాజీనామా చేస్తామని జయశంకర్​భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లికి చెందిన చింతపల్లి టీఆర్​ఎస్​ సర్పంచ్​ హెచ్చరించారు.
 

యాదాద్రి, వెలుగు: టీఆర్ఎస్​ ప్రభుత్వంలో తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామంటూ యాదాద్రి జిల్లా బీబీనగర్​ మండలంలోని అధికార పార్టీకి చెందిన సర్పంచ్​ చేసిన కామెంట్లు సోషల్​మీడియాలో వైరలయ్యాయి. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్​ మండలంలోని ఓ గిరిజన సర్పంచ్​ తన గ్రామంలో శ్మశానవాటిక నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన బిల్లు విషయంలో సర్పంచ్​కు మేస్త్రీ ఫోన్​ చేయడంతో తన ఆవేదన వ్యక్తం చేశారు. నీ పైసలు ఎక్కడికి పోవని, ఎకరం భూమి అమ్మైనా ఇస్తానంటూ తన బాధను అతడితో చెప్పుకున్నారు. టీఆర్ఎస్​ పాలనలో సర్పంచులు ఏ మాత్రం సుఖంగా లేరని, పైసలివ్వకుండానే పనులు చేయాలని నోటీసులు ఇస్తున్నారని, మెడపై కత్తి పెట్టి పని చేయమంటున్నారన్నారు. ఒత్తిడి తెస్తున్నారు కానీ బిల్లులు ఇవ్వడం లేదని చెప్పారు. ఇప్పటివరకు రూ.9.25 లక్షల వర్క్​ చేయిస్తే, ఎంబీలు కూడా చేయడం లేదని, రూ.1.71లక్షలు మాత్రమే వచ్చాయని చెప్పుకొచ్చారు. తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నానని, పనుల కోసం ఇప్పటికే పెండ్లాం పుస్తెల తాడు, కమ్మలు, బుట్టాలు కూడా అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య తనకు గుండెనొప్పి కూడా ఒకసారి వచ్చిందని చెప్పారు. అధికార పార్టీ సర్పంచులమైనప్పటికీ ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే శేఖర్​రెడ్డి కూడా తమ పరిస్థితి పట్టించుకోవడం లేదని, ఆయన నంబర్​వన్ దొంగ అని విమర్శించారు.

స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ కలవలేకపోతున్నం

సిద్దిపేట, వెలుగు: ‘సర్పంచ్​గా అప్పులు తెచ్చి.. ఆస్తులు అమ్ముకుని పనులు చేస్తే  ఉపసర్పంచులు, కార్యదర్శులు సంతకాలు పెట్టకపోవడంతో ఎంపీడీవోలకు లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజాయితీగా పనులు చేసినా బిల్లులకు కొర్రీలు పెడుతున్నారు.  అధికార పార్టీలో ఉన్నా బిల్లులు రావడం  లేదు. సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. గజ్వేల్ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్ ను వచ్చే మండల సర్వసభ్య సమావేశానికి పిలవండి. ఆయనొస్తే  సమస్యలు తెలుసుకుని నిధులు మంజూరు చేస్తారు. అవసరమైతే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తాం’ అంటూ మర్పడ్గ గ్రామ సర్పంచ్ భర్త కొండపాక మండల సభలో పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కొండపాక మండల సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. వెలికట్టె ఎంపీటీసీ సాయిబాబా మాట్లాడుతూ అధికారులు ఎందుకు పని చేస్తున్నారో అర్థం కావడం లేదని, అసలు వారు ఉన్నారా అని ప్రశ్నించారు. పీఆర్సీలు తీసుకుని ప్రజా సమస్యలు విస్మరిస్తున్నారని విమర్శించారు. వెలికట్ట గ్రామంలో పది మంది అర్హులైన వృద్ధ మహిళలకు పెన్షన్లు మంజూరు చేయాలని ఏడాదిగా చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. అదే సమయంలో మర్పడ్గ సర్పంచ్ రజిత భర్త రాజిరెడ్డి సమావేశ మందిరంలోకి వచ్చారు. తన భార్య సమస్యలపై మాట్లాడలేనందున తనకు అనుమతివ్వాలని కోరుతూ సమస్యలను వెల్లడించాడు. కొండపాక మండలం గజ్వేల్ నియోజకవర్గంలో ఉందని, గజ్వేల్ ఎమ్మెల్యేగా వున్న సీఎం కేసీఆర్ ను కలవలేని పరిస్థితి ఉందన్నారు. అధికారులు సీఎం కేసీఆర్ ను వచ్చే మండలసభకు రప్పిస్తే తమ సమస్యలు చెబితే నిధులు మంజూరు చేస్తారేమోనన్నారు. లేకుంటే తమ గతి అధోగతేనని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు వెలికట్ట గ్రామానికి చెంది పలువురు మహిళలు తమకు పెన్షన్లు ఎందుకు మంజూరు చేయడం లేదని సమావేశానికి వచ్చి అధికారులను నిలదీశారు. సర్పంచులు, ఎంపీటీసీలు పలు సమస్యలను లేవనెత్తడంతో సమావేశం వాడివేడిగా సాగింది.