ఆ ఐదు గ్రామాల ప్రజలు.. 38 ఏండ్లుగా గోస పడుతున్రు!

ఆ ఐదు గ్రామాల ప్రజలు..  38 ఏండ్లుగా గోస పడుతున్రు!
  • జిల్లా, మండలాల విభజనతో ఇబ్బందులు 
  • రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్,  ఎక్సైజ్ సేవల కోసం మూడు ప్రాంతాల్లో ఉన్న ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే
  • సమీప మండలాల్లో విలీనం చేయాలని పలుమార్లు వినతులు
  • కానరాని ఫలితం.. ముకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న సర్పంచులు, వార్డు మెంబర్లు 
  • అసెంబ్లీ ఎన్నికలు కూడా బహిష్కరిస్తామని హెచ్చరిక
  • ఇదీ.. హత్నూర మండలంలోని ఐదు గ్రామాల పరిస్థితి 

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా  హత్నూర మండలంలోని  రొయ్యపల్లి, అక్వాంచగూడ, షేర్ ఖాన్ పల్లి, నాగారం, కోడిప్యాక గ్రామాలకు మండల కేంద్రం దూరమై తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమ గ్రామాలను  ఐదు నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని జిన్నారం, మెదక్​ జిల్లాలోని నర్సాపూర్ మండాలల్లో కలుపకుండా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్నూర మండలంలో ఉంచడం సరికాదని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో, ఎమ్మార్వో, పోలీస్​స్టేషన్, ఇతర పనుల కోసం వెళ్లివచ్చేందుకు దూరభారం తప్పట్లేదని చెబుతున్నారు. 1985లో ఏర్పడిన మండల వ్యవస్థ నాటి నుంచి ఇప్పటివరకు అవే ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పలుమార్లు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడం లేదని వాపోయారు. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు ముకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.

దూరభారం ఇలా..!

హత్నూర మండలంలోని రొయ్యపల్లి, ఆక్వాంచగూడ, షేర్ ఖాన్ పల్లి, నాగారం, కోడిప్యాక గ్రామాలు మండల కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కలెక్టరేట్ సంబంధిత పనుల కోసం 30 కిలోమీటర్లు, రెవెన్యూ, పోలీస్​స్టేషన్​, ఇతర పనుల కోసం అందోల్–జోగిపేట్, మండల కేంద్రానికి ఇలా దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులకు తిరిగితేనే పనులవుతాయి. అలా కాకుండా కోడిప్యాక గ్రామాన్ని 12 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న నర్సాపూర్ మండలానికి, రొయ్యపల్లి, ఆక్వాంచగూడ, షేర్ ఖాన్ పల్లి, నాగారం గ్రామాలను ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిన్నారం మండలానికి మార్చాలని కొన్నేళ్లుగా ఆ గ్రామల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా రొయ్యపల్లి, షేర్ ఖాన్ పల్లి, నాగారం గ్రామాల నుంచి ప్రస్తుత మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కూడా లేవు. దీంతో గ్రామస్తులంతా నర్సాపూర్ వెళ్లి అక్కడి నుంచి రెండు బస్సులు మారి హత్నూరకు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. 

ప్రత్యేక రాష్ట్రంలోనూ పని కాలే.. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఐదు గ్రామాలకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో పరిష్కరిస్తామని పాలకులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయి. తొమ్మిదేండ్లుగా అనేక విజ్ఞప్తులు, ఆందోళనలు చేసినా ఫలితం మాత్రం లేదు. నాగారం, రొయ్యపల్లి పంచాయతీల నుంచి తీర్మానం అందాక ప్రభుత్వం మొదటి గెజిట్ లో జిన్నారం మండలానికి మారుస్తున్నట్లు ప్రకటించి పొలిటికల్ ఎఫెక్ట్ తో రెండో గెజిట్ లో దాన్ని ప్రభుత్వం తొలగించింది. అప్పటి నుంచి విజ్ఞప్తులు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ మధ్య జగిత్యాల, మెదక్ జిల్లాలోని పలు గ్రామాలను సమీప మండలాల్లోకి మార్చినప్పటికీ అందులో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఈ ఐదు గ్రామాలు లేకపోవడం గ్రామస్తులను ఆందోళనకు గురిచేసింది.

పార్టీ మారినా పట్టించుకోలే.. 

రొయ్యపల్లి గ్రామ పంచాయతీ మెజార్టీ పాలకవర్గం కాంగ్రెస్ వారు ఉండడంతో అప్పట్లో బీఆర్ఎస్ లోకి మారాలన్న డిమాండ్ వచ్చింది. పార్టీ మారితే ఈ గ్రామాన్ని మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిన్నారం మండలంలో విలీనం చేసేందుకు కొందరు అధికార పార్టీ నేతలు హామీ ఇచ్చారని, గ్రామస్తుల ఒత్తిడి మేరకు సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లు బీఆర్​ఎస్​లోకి  మారినట్టు ప్రచారంలో ఉంది. అయితే పార్టీ మారాక ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో ఆయా పదవులకు రాజీనామాలు చేయాలని ఇప్పుడు అదే గ్రామస్తులు పంచాయతీ పాలకవర్గంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందుకు సర్పంచ్, వార్డు మెంబర్లు సిద్ధమవుతున్నారు. రొయ్యపల్లి మాదిరిగా మిగతా నాలుగు గ్రామాల పాలకవర్గాలు కూడా రాజీనామాలకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ ఐదు గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు.

సమస్య తీవ్రంగా ఉంది

గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు మండలానికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతోంది. గ్రామాన్ని జిన్నారం మండలానికి మార్చాలని చాలాసార్లు విజ్ఞప్తి చేశాం. సమస్య పరిష్కారం కాకుంటే  సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు రాజీనామాలు చేయాలని, వచ్చే ఎన్నికలను బహిష్కరించాలని గ్రామస్తులు అంటున్నారు. 

లక్ష్మీనారాయణ, సర్పంచ్, షేర్ ఖాన్ పల్లి

ప్రజల కోసం పార్టీ మారాం.. 

గ్రామ ప్రజల సౌలభ్యం కోసం మా గ్రామాన్ని జిన్నారం మండలంలో కలుపుతామంటేనే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి మారాం. కానీ సమస్య అలానే ఉండటంతో ఈ విషయాన్ని చాలాసార్లు ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లాం. మార్పు అయితే లేదు. దీంతో మరోసారి ప్రజల కోసం పదవులను లెక్కచేయకుండా రాజీనామాలు చేసేందుకు రెడీ అవుతున్నాం. 

విజయలక్ష్మి, సర్పంచ్, రొయ్యపల్లి.