సర్పంచ్‎లకు గౌరవ వేతనాలు రావట్లే.. ఐదు నెలలుగా పైసా ఇవ్వని ప్రభుత్వం..!

సర్పంచ్‎లకు గౌరవ వేతనాలు రావట్లే.. ఐదు నెలలుగా పైసా ఇవ్వని ప్రభుత్వం..!

హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో ఇటీవల పాలనా పగ్గాలు చేపట్టిన సర్పంచ్‌‌‌‌ల పరిస్థితి దయనీయంగా మారింది. గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే వారికి ప్రభుత్వం నుంచి ఐదు నెలలుగా గౌరవ వేతనం అందడం లేదు. గ్రామాల్లో పర్యటించడానికి, పాలనా వ్యవహారాల కోసం, పెట్రోల్ ఖర్చులకైనా ఈ వేతనం ఉపయోగపడుతుందని ఆశించిన సర్పంచులకు నిరాశే మిగిలింది. 

పెండింగ్‌‌‌‌లో రూ. 41 కోట్లు 

రాష్ట్రంలోని 12,762 గ్రామ పంచాయతీల్లో గతేడాది డిసెంబర్‌‌‌‌ 22న పాలకవర్గాలు కొలువుదీరాయి. ఒక్కో సర్పంచ్‌‌‌‌కు నెలకు రూ. 6,500 చొప్పున గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. కానీ వారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ఒక్కో సర్పంచుకు ఐదు నెలల వేతనం రూ. 32,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ. 41,28,15,000 బకాయిలు పేరుకుపోయాయి. 

గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన సర్పంచులు ఆస్తులు అమ్ముకుని, అప్పులు చేసి గ్రామాభివృద్ధి పనులు చేపట్టారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులు నేటికీ విడుదల చేయడం లేదని మాజీ సర్పంచులు ఆరోపిస్తున్నారు. కనీసం కొత్త పాలకవర్గాలకైనా సకాలంలో నిధులు, వేతనాలు అందుతాయని ఆశించినా.. నిరాశే మిగిలింది. ఐదు నెలలకు సంబంధించిన వేతనాలు విడుదల చేయకపోవడంతో సర్పంచ్‌‌‌‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, పంచాయతీలకు నేరుగా నిధులు కేటాయించాలని సర్పంచుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సర్పంచులే కాదు.. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే వార్డు మెంబర్ల పరిస్థితి సైతం ఇలాగే ఉంది. వారికి అందాల్సిన సిట్టింగ్‌‌‌‌ ఫీజులు పెండింగ్‌‌‌‌లోనే ఉన్నాయి. 

విడుదల కాని నిధులు

సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత బడ్జెట్‌‌‌‌ నుంచి కేటాయిస్తుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా నిధులు విడుదలవుతాయి. కానీ, ఇందుకు సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వేతనాలు పెండింగ్‌‌‌‌లోనే ఉన్నాయి. గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీ) నిధుల నుంచి వీటిని సర్దుబాటు చేసేది.

కానీ ప్రస్తుతం ఈ గౌరవ వేతనాన్ని నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తోంది. గ్రామపంచాయతీలకు సంబంధించి సర్పంచుల వేతనాల కోసమే ప్రభుత్వం భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. సర్పంచుల గౌరవ వేతనాల కోసం నెలకు రూ. 8.30 కోట్ల చొప్పున సంవత్సరానికి సుమారు రూ.100 కోట్ల వరకు కేటాయించాల్సి వస్తోంది.

 ఇది కేవలం సర్పంచులకు సంబంధించిన వేతనాలు మాత్రమే. ఎంపీటీసీ, జడ్పీటీసీల కలిపితే ఈ మొత్తం ఇంకా పెరుగుతుంది. పరిషత్‌‌‌‌ ఎన్నికలు జరగకపోవడం.. పాలకవర్గాలు కొలువుదీరకపోవడంతో ఇప్పటివరకు ప్రభుత్వానికి ఆ భారం తప్పింది.