
రేపు ఇందిరా పార్కు ధర్నా చౌక వద్ద సర్పంచ్లు ధర్నా నిర్వహించనున్నారు. సర్పంచ్లకు, పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయనున్నారు. పోలీసుల అనుమతి కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరపున లేఖ ఇచ్చింది. కాంగ్రెస్ పక్షాన తాము ధర్నా చౌక్ వద్ద ధర్నాకు అనుమతి కోరామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, రాజీవ్ పంచాయతీ రాజ్ సంఘటన్ చైర్మన్ సిద్దేశ్వర్ తెలిపారు. అసెంబ్లీ ముట్టడికో, రాస్తారోకో కోసమో తాము అనుమతి అడగలేదన్నారు.
ధర్నా చౌక్ వద్ద ధర్నాకు అనుమతి ఇవ్వకపోయినా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్ల ధర్నా జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు పెద్ద ఎత్తున తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు. సర్పంచ్ల ధర్నాను పోలీసులు అడ్డుకుంటే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా చౌక్ ఏర్పాటు చేసిందే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకని.. అక్కడ కూడా అనుమతులు ఇవ్వకపోవడం ఏంటని మల్లు రవి, సిద్దేశ్వర్ ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై అణిచివేత ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. పోలీసులు ధర్నాకు వెంటనే అనుమతి ఇవ్వాలి.. లేకపోతే పెద్దఎత్తున పోరాటం చేసి ప్రభుత్వ మెడలు వంచుతామని వార్నింగ్ఇచ్చారు. 12, 750 గ్రామపంచాయతీ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణను రూపొందించి..ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.