సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాతనే శాట్‌‌కామ్‌‌ సర్వీస్‌‌లు.. త్వరలో స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయిస్తాం: మంత్రి సింధియా

సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాతనే శాట్‌‌కామ్‌‌ సర్వీస్‌‌లు.. త్వరలో స్పెక్ట్రమ్ ధరలను నిర్ణయిస్తాం: మంత్రి సింధియా

న్యూఢిల్లీ: దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌‌కామ్‌‌) సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే, సెక్యూరిటీ ఏజెన్సీల ఆదేశాలను పాటించిన తర్వాతనే స్టార్‌‌‌‌లింక్‌‌, యూటెల్‌‌శాట్‌‌ వన్‌‌, జియో ఎస్‌‌జీఎస్‌‌ వంటి కంపెనీల సర్వీస్‌‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. స్పెక్ట్రమ్ ధరలు నిర్ణయించిన వెంటనే ప్రభుత్వం ఈ సంస్థలకు స్పెక్ట్రమ్ కేటాయిస్తుందని చెప్పారు. 

‘‘ఇప్పటికే లైసెన్స్ పొందిన వన్‌‌వెబ్‌‌, రిలయన్స్ జియో, స్టార్‌‌‌‌లింక్‌‌ కంపెనీలు ఇండియాలోనే డేటా స్టోర్​చేసేలా సెక్యూరిటీ క్లియరెన్స్ పొందాల్సి ఉంది. సెక్యూరిటీ ఏజెన్సీల ఆదేశాలను పాటించే కంపెనీలకు ఇప్పటికే ప్రావిజనల్‌‌గా స్పెక్ట్రమ్‌‌ కేటాయించాం. స్పెక్ట్రమ్‌‌ ధరను డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డాట్‌‌), టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌‌) నిర్ణయిస్తాయి. వీటి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి.  త్వరలో పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం” అని సింధియా పేర్కొన్నారు.

కాగా, వార్షిక స్పెక్ట్రమ్ ఫీజు 4శాతం బదులు 5శాతం  ఉండాలని,  పట్టణ ప్రాంతాల్లో కనెక్షన్‌‌కు రూ.500 ఫీజు రద్దు చేయాలని డాట్ సూచించగా, వీటిని ట్రాయ్‌‌ తిరస్కరించింది. స్పెక్ట్రమ్ ధరలపై తుది నిర్ణయాన్ని డీసీసీ (డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్) తీసుకోనుంది.

ఇండియాలో 4 టెలికోలు

వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీ) ప్రభుత్వానికి సుమారు రూ.2 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాలి. అందులో రూ.1.19 లక్షల కోట్లు స్పెక్ట్రమ్ బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వ సపోర్ట్ లేకపోతే కేంద్రానికి చెందిన రూ.53,083 కోట్ల విలువైన ఏజీఆర్ బకాయిలు, ఈక్విటీ వాల్యూ జీరో అవుతాయని కంపెనీ డాట్‌‌కి రాసిన లెటర్‌‌‌‌లో పేర్కొంది. కంపెనీకి రిలీఫ్ ఇవ్వడంపై పనిచేస్తున్నామని సింధియా తెలిపారు.  

ప్రభుత్వం ఇప్పటికే రూ.37 వేల కోట్ల బకాయిలను ఈక్విటీగా మార్చి, వీ లో 49శాతం వాటా కలిగి ఉందన్నారు. ఎటువంటి రిలీఫ్ దొరకకపోతే , వీ  2026 మార్చి నాటికి రూ.18 వేల కోట్లు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఇంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత్‌‌లో రిలయన్స్ జియో, ఎయిర్‌‌‌‌టెల్‌‌, వీ, బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ అనే నాలుగు ప్రధాన టెలికాం సంస్థలు ఉన్నాయి. 

వీ 21 కోట్ల మంది యూజర్లకు, బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌ 10 కోట్ల  మంది కస్టమర్లకు సేవలు అందిస్తున్నాయి. ‘‘ప్రపంచంలో చాలా దేశాల్లో నాలుగు టెలికాం సంస్థలు ఉండవు. భారత్‌‌లో మాత్రం నాలుగు బలమైన టెలికోలు ఉన్నాయి. ఈ సమతుల్యత కొనసాగాలి”అని సింధియా  పేర్కొన్నారు.