శాటిలైట్ చానెల్స్ ఇండస్ట్రీకి గడ్డు కాలం.. 50 చానెల్స్ బంద్.. లైసెన్సులు వాపస్

శాటిలైట్ చానెల్స్ ఇండస్ట్రీకి గడ్డు కాలం.. 50 చానెల్స్ బంద్.. లైసెన్సులు వాపస్

న్యూఢిల్లీ: శాటిలైట్​ చానెల్స్​ ఇండస్ట్రీకి గడ్డుకాలం దాపురించింది. గత మూడేళ్లలో సుమారు 50 చానెల్స్​ తమ లైసెన్సులను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశాయి. కేంద్ర సమాచార,  ప్రసార మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం లైసెన్సులను వదులుకున్న వాటిలో జియో స్టార్, జీ ఎంటర్ టైన్మెంట్, ఈనాడు టెలివిజన్, టీవీ టుడే నెట్ వర్క్, ఎన్ డీటీవీ వంటి పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి. 

ప్రేక్షకులలో వస్తున్న మార్పులు, డిజిటల్ విప్లవం  ప్రకటనల ఆదాయంపై పడుతున్న ప్రభావమే ఈ పరిస్థితికి కారణం. సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ ఇండియా సంస్థ కూడా 26 డౌన్ లింకింగ్ అనుమతులను వెనక్కి ఇచ్చింది.  ప్రజల అలవాట్లలో వస్తున్న మార్పుల వల్ల పే టీవీ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వైపు ఆకర్షితులు అవుతుంటే, సామాన్య వర్గాలు ఉచితంగా లభించే డీడీ ఫ్రీ డిష్ కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

దీనివల్ల  డీటీహెచ్ పే కస్టమర్ల సంఖ్య 2019 లో రూ.7.2 కోట్లు ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.6.2 కోట్లకు పడిపోయింది. మున్ముందు ఈ సంఖ్య ఇంకా తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రిపోర్ట్​ హెచ్చరించింది. ప్రకటనల ఆదాయం కూడా ఆశించిన స్థాయిలో అందడం లేదు. 

మొత్తం అడ్వర్టైజింగ్ మార్కెట్ 2025లో 9.2 శాతం వృద్ధి చెంది రూ.1.8 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసినప్పటికీ, టీవీ ప్రకటనల ఆదాయం మాత్రం 1.5 శాతం తగ్గి రూ.47,740 కోట్లు కు పరిమితం కావొచ్చని డబ్ల్యూపీపీ అంచనా వేసింది. హిందీ  వినోద రంగంలో టాప్ 10 లో కొనసాగుతున్న దంగల్ చానల్ కూడా దంగల్ హెచ్ డీ,  దంగల్ ఒరియా లైసెన్సులను వదులుకుంది.