పోర్టుల్లో పెట్టుబడులకు సౌదీ ఆసక్తి... స్మార్ట్ పోర్ట్ నిర్మాణంపై చర్చలు: కేంద్ర మంత్రి సోనోవాల్

పోర్టుల్లో పెట్టుబడులకు సౌదీ ఆసక్తి... స్మార్ట్ పోర్ట్ నిర్మాణంపై చర్చలు: కేంద్ర మంత్రి సోనోవాల్

న్యూఢిల్లీ: భారత సముద్ర రంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత, మహిళలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలు కీలకపాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. ఢిల్లీలో శుక్రవారం​ ‘సాగరమంథన్: ది గ్రేట్ ఓషన్స్ డైలాగ్ 2026’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో సౌదీ అరేబియా, బెల్జియం, భూటాన్ ప్రతినిధులతో చర్చించారు. వాద్వాన్​, గలాథియా బే వంటి భారతీయ ఓడరేవుల ప్రాజెక్టుల్లో, మారిటైమ్ డెవలప్‌‌మెంట్ ఫండ్‌‌లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ అరేబియా ఆసక్తి చూపింది. 

బెల్జియంతో కలిసి పర్యావరణహిత నౌకాయాన కారిడార్, స్మార్ట్ పోర్టు సాంకేతికతపై చర్చించారు.  కేంద్ర సహాయ మంత్రి శంతను ఠాకూర్ కూడా గ్రీస్, లిథువేనియా, మొజాంబిక్, మయన్మార్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. గత 12 ఏళ్లలో భారత నావికుల సంఖ్య 1.27 లక్షల నుంచి 3.23 లక్షలకు పెరిగిందని, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నావికా సిబ్బంది సరఫరాదారుగా భారత్ నిలిచిందని అధికారులు తెలిపారు. 

సముద్ర రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ‘మిషన్ 20%’ అమలు చేస్తున్నామని, గత 12 ఏళ్లలో దేశ ఓడరేవుల వార్షిక సరుకు నిర్వహణ సామర్థ్యం 2,817 మిలియన్ టన్నులకు పెరిగిందని మంత్రి శర్వానంద్​ వెల్లడించారు.