ఇమ్రాన్ ఖాన్.. మా ఫ్లైట్ మాకిచ్చేయ్

ఇమ్రాన్ ఖాన్..  మా ఫ్లైట్  మాకిచ్చేయ్

ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి తన దేశానికి వస్తున్న ఇమ్రాన్ ఖాన్ విమానం టెక్నికల్ ఇష్యూ  కారణంగా న్యూయార్క్‌లోనే ల్యాండ్  అయిందని , దీంతో ఆయన మరో ఫ్లైట్‌లో పాకిస్తాన్ చేరుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే దీనికి అసలు కారణం విమానంలో సాంకేతిక లోపం కాదట. ఆ విమానం సౌదీ యువరాజుకి చెందినదని, ఇమ్రాన్ ఆ ఫ్లైట్ లో ప్రయాణించడం తనకు ఇష్టం లేకపోవడంతో, ఇమ్రాన్ పాకిస్తాన్ కు చేరుకోకుండానే మధ్యలోనే దిగిపోయాడని ‘ఫ్రైడే టైమ్స్‌’  అనే వార పత్రిక ఓ కథనం ప్రచురించింది.

వివరాల్లోకి వెళ్తే..  గత నెల ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లే ముందు ఇమ్రాన్ ఖాన్ సౌదీలో రెండు రోజుల పాటు పర్యటించారు. అయితే ప్రధానిగా వచ్చిన ఇమ్రాన్ ఖాన్‌ను కమర్షియల్ ఫ్లైట్‌లో పంపడం ఇష్టం లేక… సౌదీ రాజు తన పర్సనల్ జెట్ విమానం ఇచ్చి అతిథి మర్యాదలు చేశారట. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఆ ఫ్లైట్‌లోనే అమెరికా పర్యటనకు తన టీంతో కలిసి బయల్దేరి వెళ్లారు.

అయితే ఐరాస సమావేశాల్లో ఇమ్రాన్ అనుసరించిన ‘ దౌత్యనీతి ‘ సౌదీ రాజుకి నచ్చలేదట. అంతేకాదు. ఇమ్రాన్  టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తోను, మలేసియా ప్రధాని మహాతిర్ మహమ్మద్ తోను మిలాఖత్ అయి.. ‘ ఐక్య ఇస్లామిక్ బ్లాక్ ‘ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేయడం కూడా ఆ రాజుకి సహించలేదట. అందుకే తన విమానాన్ని తిరిగి ఇచ్చేయాలని సౌదీ రాజు అడిగినట్లుగా ఫ్రైడే టైమ్స్‌ తన కథనంలో తెలిపింది. అయితే ఇదంతా ‘ కట్టుకథ ‘ అని  పాకిస్తాన్ ప్రభుత్వం అంటోంది.

Saudi Crown Prince Salman 'snubbed' Pak PM Imran, recalled his private jet from US