రోడ్లు, కార్లు లేని వినూత్న సిటీని నిర్మిస్తోన్న సౌదీ

రోడ్లు, కార్లు లేని వినూత్న సిటీని నిర్మిస్తోన్న సౌదీ

రియాద్: క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాలో ఆయిల్, కార్లు, రోడ్లు, కర్బన ఉద్గారాలు లేని కొత్త నగరాన్ని రూపొందించనున్నారు. 170 కిలోమీటర్ల వైశాల్యంలో రూపొందబోయే ఈ సిటీకి ది లైన్ అనే పేరు పెట్టారు. నియామ్ అనే 500 బిలియన్ల ప్రాజెక్టులో భాగంగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. త్వరలోనే దీని నిర్మాణాన్ని మొదలుపెట్టనున్నట్లు ఆదివారం క్రౌన్ ప్రిన్స్ తెలిపారు. ‘అభివృద్ధి కోసం ప్రకృతిని పాడు చేయాలా? లైన్‌‌ నిర్మాణానికి అవసరమయ్యే ఇన్వెస్ట్‌‌మెంట్‌‌లో పెద్ద మొత్తాన్ని సౌదీ ప్రభుత్వమే భరిస్తుంది. నీయామ్‌‌ ప్రాజెక్టుకు కేటాయించిన 500 బిలియన్లలో నుంచి ఈ లైన్ నిర్మాణానికి వెచ్చించనున్నాం. ప్రభుత్వంతోపాటు పీఐఎఫ్, లోకల్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా పదేళ్ల పాటు సహకరిస్తారు’ అని క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ రిపోర్టకు తెలిపారు.

లైన్‌‌లో హైపర్ కనెక్టెడ్ కమ్యూనిటీస్‌‌ను డెవలప్ చేస్తారు. పచ్చని ప్రకృతి నడుమ ఎలాంటి రోడ్లు, కార్లు లేకుండా దీని నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఇందులో 10 లక్షల మంది నివసించబోతున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 4 లక్షల పైచిలుకు జాబ్స్‌‌ను క్రియేట్ చేయనున్నారు. లైన్‌‌లో మౌలిక వసతుల ఏర్పాటుకు 100 నుంచి 200 బిలియన్లు ఖర్చు పెట్టనున్నారని సమాచారం. కొత్త టెక్నాలజీలు, వ్యాపారాలకు హబ్‌గా లైన్‌‌ను అభివృద్ధి చేయనున్నారు.