సీట్ బెల్ట్‌‌‌‌ పెట్టుకుంటలేరు!

సీట్ బెల్ట్‌‌‌‌ పెట్టుకుంటలేరు!
  • అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు
  • సీట్ బెల్ట్ తప్పనిసరి కాదని 37 శాతం మంది అంటున్నరు
  • వెనుక కూర్చునే వారిలో 98 శాతం మంది నో సీట్ బెల్ట్‌‌‌‌
  • దేశంలో 89 శాతం బస్సుల్లో సీటు బెల్టుల్లేవు
  • సేవ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సీట్ బెల్ట్.. ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడే ‘లైఫ్ జాకెట్’. కానీ చాలా మంది కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. కొందమందికైతే అసలు అలాంటిది ఒకటి ఉంటుందనే విషయమే గుర్తుండదు. దీంతో యాక్సిడెంట్‌‌‌‌ జరిగినప్పుడు ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. సేవ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ అనే సంస్థ ఇదే విషయాన్ని చెబుతోంది. సీట్‌‌‌‌ బెల్ట్‌‌‌‌కు సంబంధించిన సర్వే చేసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

వెనకున్నోళ్లు అస్సలు పట్టించుకోరు

వరల్డ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ ఆర్గనైజేషన్‌‌‌‌ స్టడీ ప్రకారం వెనుక సీటు బెల్టు ఉపయోగిస్తే 25 శాతం మరణాలు, 75 శాతం గాయాలు తగ్గే అవకాశం ఉంది. వెనుక కూర్చునే వారిలో ఎక్కువ మంది సీట్ బెల్ట్‌‌‌‌ ధరించకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని సేవ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ తమ స్టడీలో గుర్తించింది. మొదటిది తప్పనిసరి అని భావించకపోవడం, రెండోది అవగాహన లేకపోవడం. దేశంలోని 11 ప్రధాన నగరాల్లో 7 శాతం మంది మాత్రమే వెనుక సీటు బెల్ట్‌‌‌‌ పెట్టుకుంటున్నారు. మొత్తంగా 98.2 శాతం మంది వెనుక సీటు ప్రయాణికులు సీట్ బెల్టు ధరించడం లేదు. దేశంలో 37 శాతం మంది సీట్ బెల్ట్ తప్పనిసరి కాదని భావిస్తుండగా, 29 శాతం మందికి దీనిపై కనీసం అవగాహనే లేదు. 70.5 శాతం మంది తమ కారులో వెనుక సీటు బెల్టులు ఉన్నాయని ధ్రువీకరించారు.

2017లో 26,896 మంది

గత పదేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దేశవ్యాప్తంగా 13 లక్షల మంది చనిపోగా, 50 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. ఒక్క సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే 2017లో దేశంలో 26,896 మంది చనిపోయారు. 31,421 మంది క్షతగాత్రులయ్యారు. 2016లో 5,638 మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో 2018లో సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడిపిన 1,11,519 మందిపై కేసులు నమోదు చేసి, రూ.1,57,61,214 ఫైన్ విధించారు.

స్కూల్‌‌‌‌ బస్సుల్లో సీట్‌‌‌‌ బెల్టుల్లేవు

2017లో 9,408 మంది చిన్నారులు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అంటే ప్రతి రోజు 26 మంది మృత్యువాత పడుతున్నారు. తమ పిల్లలు సీట్‌‌‌‌ బెల్ట్‌‌‌‌ ధరించకుండానే స్కూల్‌‌‌‌ బస్సులు, వ్యాన్లలో ప్రయాణిస్తున్నారని 77 శాతం మంది తల్లిదండ్రులు పేర్కొన్నారు. 64 శాతం మంది పేరెంట్స్‌‌‌‌ ప్రస్తుత నగర రోడ్లు చిన్నారులకు సురక్షితం కావని అభిప్రాయపడ్డారు. 88.8 శాతం బస్సుల్లో సీటు బెల్టులు లేవని డ్రైవర్లు పేర్కొన్నారు. 11.2 శాతం మంది మాత్రమే స్కూల్‌‌‌‌ బస్సులు, వ్యాన్లలో మాత్రమే సీట్‌‌‌‌ బెల్ట్‌‌‌‌లు ఉన్నాయని స్పష్టం చేశారు. చిన్నారుల కోసం పకడ్బందీ రోడ్డు భద్రత చట్టాన్ని తీసుకురావాలని 91.4 శాతం మంది కోరారు.

సర్వే ఇట్ల చేసిన్రు

దేశంలోని పలు నగరాల్లో సేవ్‌‌‌‌ లైఫ్‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌ సంస్థ సర్వే నిర్వహించింది. చిన్నారులు, తల్లిదండ్రులు, క్యాబ్‌‌‌‌, స్కూల్‌‌‌‌, బస్సు డ్రైవర్లపై రీసెర్చ్‌‌‌‌ చేసింది. రోడ్డు సంబంధిత ఎక్స్​పర్టులు, మెడికల్‌‌‌‌ ప్రాక్టీషనర్లు, ట్రాఫిక్‌‌‌‌ అధికారులు, స్కూల్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌ మేనేజర్లను కూడా లోతుగా విశ్లేషించింది. వారితో గ్రూప్‌‌‌‌లవారీగా డిస్కస్ చేసింది. 6,306 మందిని ఫేస్‌‌‌‌ టు ఫేస్‌‌‌‌ ఇంటర్వ్యూ చేసింది. రెండు ఫోకస్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ డిస్కషన్స్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌జీడీ), 100 బస్సులు, వ్యాన్లు, 1,077 ఇతర వాహనాలపై సర్వే చేసింది.