సైనికుడిగా దేశాన్ని కాపాడిన.. కానీ, భార్యను రక్షించుకోలేకపోయా!

సైనికుడిగా దేశాన్ని కాపాడిన.. కానీ, భార్యను రక్షించుకోలేకపోయా!

న్యూఢిల్లీ: కార్గిల్​ యుద్ధంలో దేశం తరఫున పోరాడా.. దేశాన్ని కాపాడా కానీ నా ఇంటిని, భార్యను కాపాడుకోలేక పోయానని రిటైర్డ్​ సోల్జర్, మణిపూర్ వీడియో బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలను నగ్నంగా మార్చి ఊరేగించిన ఘటనలో బాధితులు ముగ్గురు అని తాజాగా వెల్లడైంది. అందులో ఒక బాధితురాలి భర్త మాజీ సైనికుడు. అస్సాం రెజిమెంట్​లో సుబేదార్​గా సేవలందించి రిటైర్ అయ్యారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొనడంతో పాటు ఇండియన్ పీస్ కీపింగ్​ ఫోర్స్ సోల్జర్​గా శ్రీలంకలోనూ సేవలందించారు. తాజాగా ఓ మీడియా సంస్థతో  మాజీ సోల్జర్ మాట్లాడుతూ.. యుద్ధభూమికన్నా నేను పుట్టిపెరిగిన ఊరే ఇప్పుడు భయంకరంగా ఉందన్నారు. ఆ దురదృష్టకర ఘటన జరిగిన రోజును గుర్తుచేసుకుంటూ.. మరో తెగకు చెందిన గుంపు తమ ఊరిపై దాడి చేసిందని చెప్పారు. ఇళ్లల్లోకి చొరబడి దోచుకుని, ఆపై వాటికి నిప్పంటించిందని తెలిపారు. వారి నుంచి తప్పించుకునేందుకు గ్రామస్థులంతా పక్కనే ఉన్న అడవిలోకి పారిపోయారని, అయినా వెంటాడుతూ వెళ్లి తన భార్యతో సహా మరో కుటుంబాన్ని దొరకబట్టిందన్నారు. ఆ తర్వాత తమను కూడా పట్టుకుని ఊళ్లోకి తిరిగి తీసుకొచ్చారని, తన భార్యతో సహా మరో ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చి ఊరేగించారని చెప్పారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఈ దారుణాన్ని అడ్డుకోలేదని ఆరోపించారు. ఈ దారుణానికి తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్​ చేశారు.