- ఈ మైలురాయిని అందుకున్న మూడో బ్యాంక్‌గా రికార్డ్
- ఆల్‌టైమ్ హైకి
- చేరుకున్న బ్యాంక్ షేరు
- ఇంట్రాడే నష్టాల నుంచి
- 1,100 పాయింట్లు
- రికవరీ అయిన సెన్సెక్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మార్కెట్ క్యాప్ మొదటి సారిగా రూ. 5 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. ఫలితంగా మార్కెట్ క్యాప్ విషయంలో మూడో అతిపెద్ద బ్యాంక్‌గా, ఏడో అతిపెద్ద ఇండియన్ కంపెనీగా ఎస్‌బీఐ నిలిచింది. బ్యాంక్ షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 22 శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ షేరు బుధవారం సెషన్‌లో 2.6 శాతం పెరిగి రూ. 274 వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. గత ఆరు సెషన్‌లను లాభాల్లో ముగించిన ఈ బ్యాంక్ షేరు, ఈ టైమ్ పీరియడ్‌లో 7 శాతం లాభపడింది. మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు ఎస్‌బీఐ కంటే ముందున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యూనిలీవర్‌లు కూడా మార్కెట్ క్యాప్ పరంగా ఎస్‌బీఐ కంటే ముందున్నాయి.
మన మార్కెట్‌లపై ‘యూఎస్’ పనిచేయలే
యూఎస్ ఇన్‌ఫ్లేషన్ పెరిగినా, గ్లోబల్‌గా వడ్డీ రేట్ల పెంపు భయాలు ఎక్కువైనా మన మార్కెట్‌లు మాత్రం వీటికి తలొంచలేదు. యూఎస్ మార్కెట్‌లు మంగళవారం సెషన్‌లో భారీగా క్రాష్ అవ్వడంతో బుధవారం గ్లోబల్ మార్కెట్లన్నీ తీవ్రంగా నష్టపోయాయి. మన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు మాత్రం ఓపెనింగ్ సెషన్‌లో 2 శాతం పతనమైనా, తిరిగి కోలుకొని కీలక లెవెల్స్ పైన క్లోజవ్వగలిగాయి. మార్కెట్‌లో బుల్స్ హవా కొనసాగిన వేళ బుధవారం సెన్సెక్స్ 1,100 పాయింట్ల నష్టం నుంచి కోలుకొని కేవలం 224 పాయింట్ల (0.37 శాతం) లాస్‌తో 60,347 వద్ద ముగిసింది. నిఫ్టీ ఓపెనింగ్ సెషన్‌లో 17,770 వరకు పడిపోయింది. బయ్యింగ్ రావడంతో నష్టాలను తగ్గించుకొని 18,004 వద్ద ముగిసింగి. ఈ ఇండెక్స్ బుధవారం సెషన్‌లో 66 పాయింట్లు నష్టపోయింది. ‘గ్లోబల్ మార్కెట్‌లు క్రాష్ అవ్వడంతో ఓపెనింగ్ సెషన్‌లో మన మార్కెట్‌లు పడ్డాయని, కానీ, దేశ ఎకానమీపై నమ్మకం పెరగడంతో ఇంట్రాడేలో కొనుగోళ్లు ఊపందుకున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. మరోవైపు ఆగస్టు నెలకు సంబంధించి దేశ హోల్ సేల్ ఇన్‌ఫ్లేషన్ తగ్గడం మార్కెట్‌కు సపోర్ట్‌గా నిలిచింది. డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం సెషన్‌లో 29 పైసలు తగ్గి 79.44 వద్ద సెటిలయ్యింది.
యూఎస్ ఇన్‌ఫ్లేషన్ మరింత పైకి..
ఈ ఏడాది ఆగస్టు నెలలో యూఎస్‌లో కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 8.3 శాతానికి (ఏడాది ప్రాతిపదికన) పెరిగింది. నెలవారీగా చూస్తే యూఎస్‌లో ఇన్‌ఫ్లేషన్ 0.6 శాతం పెరగడం గమనించాలి. ఈసారి ఇన్‌ఫ్లేషన్ ఏడాది ప్రాతిపదికన 8.1 శాతానికి, నెల ప్రాతిపదికన 0.3 శాతం పెరుగుతుందన్న ఎనలిస్టుల అంచనాలు తప్పాయి. ఫలితంగా మంగళవారం సెషన్‌లో మేజర్ ఇండెక్స్‌లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. దీని ప్రభావం బుధవారం సెషన్‌లో ఆసియా మార్కెట్‌లపై పడింది. యూరప్‌లోని మెజార్టీ మార్కెట్‌లు కూడా నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. యూఎస్‌లో ఇన్‌ఫ్లేషన్ పెరగడంతో ఈ నెలలో జరగనున్న మీటింగ్‌లో మానిటరీ పాలసీని ఫెడ్ మరింత కఠినతరం చేస్తుందనే భయాలు ఎక్కువయ్యాయి. వడ్డీ రేటును ఫెడ్ 100 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందనే వార్తలూ వస్తున్నాయి.
17,900 పైన కదిలితేనే..
డైలీ చార్ట్‌లో నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్‌ను ఏర్పాటు చేసిందని, కానీ, అదే టైమ్‌లో 18,100 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదుర్కొంటోందని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. బుల్స్‌కు 17,900 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్‌గా పనిచేస్తుందని, ఈ లెవెల్ పైన కదిలేంత వరకు 18,100, 18,150 వరకు నిఫ్టీ వెళ్లగలదని అన్నారు. మరోవైపు 17,900 వద్ద అమ్మకాలు చూడొచ్చని, ఈ లెవెల్ కోల్పోతే నిఫ్టీకి 17,750–17,700 దగ్గర సపోర్ట్ దొరకొచ్చని వివరించారు. ఈ నెల 20–21 న జరిగే ఫెడ్ పాలసీ మీటింగ్ నిఫ్టీ కదలికలను నిర్ణయిస్తుందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే అన్నారు. నిఫ్టీకి 18,115 వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదురవుతుందని, కొనుగోళ్లు ఎక్కువగా జరిగితే 18,605 వరకు కదలొచ్చని అన్నారు.
