SBI లాభం రూ.838 కోట్లకే పరిమితం

SBI లాభం రూ.838 కోట్లకే పరిమితం

మనదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌‌బీఐ.. ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగోక్వార్టర్‌‌లో అంచనాలను అందుకోలేకపోయింది. నికరలాభం ఏకంగా 79 శాతం పడిపోయి రూ.838 కోట్లుగా నమోదయింది. 2017–18 ఆర్థిక సంవత్సరం క్యూలో ఇది రూ.7,718 కోట్ల లాభం ఆర్జించింది. లోన్‌‌లాస్‌‌లకు అధిక నిధులు కేటాయించడం వల్లే లాభం తగ్గిందని ఎస్‌‌బీఐ ప్రకటించింది. అయితే, ప్రొవిజన్‌‌ కవరేజ్‌‌ రేషియో (పీసీఆర్‌‌) మాత్రం వార్షిక ప్రాతిపదికన 12.6 శాతం, క్వార్టర్‌‌ వారీగా 4.1 శాతం పెరిగి 79 శాతానికి చేరింది. నికర వడ్డీ ఆదాయం గత క్యూ4తో పోలిస్తే 15 శాతం పెరిగి రూ.22,954 కోట్లకు చేరింది. నిర్వహణపరమైన ఖర్చులు ఇదే కాలంలో రూ.16,586 కోట్ల నుంచి రూ.18,706 కోట్లకు పెరిగాయి. లోన్‌‌లాస్‌‌ ప్రొవిజన్లు ఇది వరకటి క్వార్టర్‌‌లో రూ.13,871 కోట్లు కాగా, క్యూ4లో రూ.17,336 కోట్లకు చేరాయి. డిపాజిట్లు ఈ కాలంలో మూడు శాతం మాత్రమే పెరిగాయి.

ఆస్తుల నాణ్యతను పరిశీలిస్తే మొండిబకాయిల స్లిపేజ్‌‌లకు రూ.7,500 కోట్లు ఇచ్చారు. కార్పొరేట్‌‌ స్లిపేజ్‌‌లు వార్షిక ప్రాతిపదికన రూ.1,220 కోట్ల నుంచి రూ.2,284 కోట్లకు పెరిగాయి. ఇటీవల మూతబడ్డ జెట్‌‌ ఎయిర్‌‌వేస్‌‌కు లోన్లు ఇవ్వడం వల్లే కార్పొరేట్‌‌ స్లిపేజ్‌‌లు పెరిగాయి. పరిమిత స్లిపేజ్‌‌లు, అధిక రికవరీలు, ప్రొవిజన్ల వల్ల స్థూల ఎన్‌‌పీఏల నిష్పత్తి 7.53 శాతానికి, నికర ఎన్‌‌పీఏల నిష్పత్తి 3.01 శాతానికి పడిపోయింది. గత క్యూ4తో పోలిస్తే ఈసారి క్యూ4లో అడ్వాన్సులు 12 శాతం పెరిగాయి. దేశీయ లోన్‌‌బుక్‌‌ 14 శాతం వృద్ధి సాధించడమే ఇందుకు కారణం. మొత్తంలో లోన్లలో విదేశీ లోన్ల వాటా 13 శాతం ఉంది. మొత్తం డిపాజిట్లలో లో–కాస్ట్‌‌ కరెంట్‌‌ అకౌంట్​ సేవింగ్‌‌ అకౌంట్‌‌ (సీఏఎస్‌‌ఏ) డిపాజిట్ల వాటా 46 శాతం ఉంది. నికర వడ్డీ మార్జిన్‌‌ (ఎన్‌‌ఐఎం) క్యూ4లో స్వల్పంగా 2.95 శాతం పెరిగింది. ఎన్సీఎల్టీ తీర్పుల కారణంగా ఎస్సార్‌‌ స్టీల్‌‌, అలోక్ ఇండస్ట్రీస్‌‌, భూషణ్‌‌ స్టీల్‌‌ నుంచి రావాల్సిన రూ.16 వేల కోట్లు వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకు టైర్‌‌ 1 క్యాపిటల్‌‌ అడెక్వసీ ఈ క్వార్టర్‌‌లో 9.62 శాతంగా నమోదయింది. కాబట్టి క్వాలిఫైడ్‌‌ ఇన్‌‌స్టిట్యూషనల్‌‌ ప్లేస్మెంట్‌‌ (క్విప్‌‌) ద్వారా మూలధనాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. జనరల్‌‌ ఇన్సూరెన్స్‌‌, కార్డ్‌‌ వ్యాపారంలోని వాటాలను అమ్మేయడానికి ఐపీఓకు వెళ్లే అవకాశాలను ఈ బ్యాంకు పరిశీలిస్తోంది.

వడ్డీరేట్లు తగ్గింపు

ఎస్‌‌బీఐ దాదాపు అన్ని రకాల లోన్లపై వడ్డీరేట్లను తగ్గించింది. ఇందుకోసం మార్జినల్‌‌ కాస్ట్‌‌ బేస్డ్‌‌ లెండింగ్‌‌ రేట్‌‌ (ఎంసీఎల్‌‌ఆర్‌‌) ఐదు బేసిస్‌‌పాయింట్లు తగ్గించింది. ఫలితంగా ఏడాది ఎంసీఆర్‌‌ రేటు 8.5 శాతం నుంచి 8.45 శాతానికి దిగి వచ్చింది. ఫలితంగా ఎంసీఎల్‌‌ఆర్‌‌తో సంబంధం ఉండే అన్ని లోన్లపై వడ్డీరేటు శుక్రవారం నుంచి ఐదు బేసిస్‌‌ పాయింట్లు తగ్గుతాయని ఎస్‌‌బీఐ తెలిపింది. అన్ని లోన్లపై ఇలా వడ్డీరేట్లు తగ్గించడం గత నెల రోజుల్లో ఇది రెండోసారి. ఆర్‌‌బీఐ గత నెల రెపోరేటును తగ్గించినప్పుడు కూడా ఎస్‌‌బీఐ వడ్డీరేట్లను ఐదు బేసిస్‌‌ పాయింట్ల మేర తగ్గించింది. గత నెల పది నుంచి ఇప్పటి వరకు హోంలోన్లపై వడ్డీరేట్లు 15 బేసిస్‌‌ పాయింట్లు తగ్గాయి. ఇక నుంచి ఒక నెల  కాల పరిమితి రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు  8.15 శాతం నుంచి 8.10 శాతానికి తగ్గింది. మూడు నెలల, ఆరు నెలల  రుణ  వడ్డీ రేటు వరుసగా  8.15 , 8.30 శాతానికి  తగ్గాయి.  రెండు,  మూడు సంవత్సరాల రేట్లు 8.55 శాతం, 8.65 శాతం వసూలు చేస్తారు.