ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై వేసవి సెలవుల తర్వాత విచారణ

ఆర్టికల్ 370 రద్దు పిటిషన్లపై వేసవి సెలవుల తర్వాత విచారణ

న్యూఢిల్లీ : ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ పై దాఖలైన పిటిషన్లను కోర్టు వేసవి సెలవుల తర్వాత పరిశీలిస్తామని చెప్పింది. ప్రస్తుతం జమ్మూలో డీలిమిటేషన్‌పై జరుగుతున్నందున పిటిషన్‌పై తక్షణ విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. లాయర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం ఇది ఐదుగురు జడ్జిలు విచారించాల్సిన అంశమని, అందుకోసం బెంచ్ ను ఏర్పాటుచేయాల్సి ఉంటుందని చెప్పింది. వేసవి సెలవుల తర్వాత పిటిషన్ల విచారణకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. 

2019లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి తెచ్చింది. దాని మేరకు జమ్ము కశ్మీర్ను జమ్ము, లద్దాఖ్ అని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను పరిశీలిస్తోంది.