- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ములుగు/రేగొండ, వెలుగు : ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలతో పాటు అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. శనివారం ములుగు, భూపాలపల్లి కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు మంజూరైన ఫండ్స్, వినియోగించిన నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కేసులను 15 రోజుల్లో పరిష్కరించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల వారిని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం పక్కాగా అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పనిచేయాలని చెప్పారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన ప్లానింగ్‌తో ముందుకు వెళ్తోందన్నారు. జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే కమిషన్ ఆఫీస్‌లో దరఖాస్తులు ఇవ్వాలని బాధితులకు సూచించారు.
ములుగులో కలెక్టర్ దివాకర్, ఎస్పీ పి.శబరీశ్, భూపాలపల్లిలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, కమిషన్ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్, రేణిగుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు. అలాగే హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లికి చెందిన చిలువేరు భిక్షపతి, వరంగల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మొలుగూరి ఆనంద్ భూములను పరిశీలించారు. తమ భూములు కబ్జాకు గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆయన శనివారం భూములను పరిశీలించి మాట్లాడారు. దళితుల భూములు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు.