దేశవ్యాప్తంగా క్రాకర్స్ నిషేధించాలి: సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా క్రాకర్స్ నిషేధించాలి: సుప్రీంకోర్టు  కీలకవ్యాఖ్యలు

బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీపావళికి దేశ రాజధాని ఢిల్లీప్రాంతంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బాణసంచా నిషేధించాలని సుప్రీంకోర్టు శుక్రవారం(సెప్టెంబర్ 12) సూచించింది. కాలుష్యం ఒక్క ఢిల్లీ ప్రజలకేకాదు.. దేశంలో అనేక చోట్ల వాయు కాలుష్యం విపరీతంగా ఉంది. అందుకే దేశవ్యాప్తంగా బాణసంచా కాల్చడం నిషేధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. 

ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దీపావళి సీజన్ కు ముందు బాణసంచా నిషేధం అంశాన్ని సుప్రీంకోర్టు విచారించింది. ఏప్రిల్3న ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో బాణసంచా అమ్మకం, నిల్వ, రవాణా,తయారీని నిషేధిస్తూ  జారీ చేసిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో బాణసంచాపై పూర్తి నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సిఎక్యూఎంకు కూడా సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. 

కాలుష్యాన్ని అరికట్టే విధానం దేశవ్యాప్తంగా ఉండాలి:CJI

ఈ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ మాట్లాడుతూ.. ఎన్‌సిఆర్ నగరాలకు స్వచ్ఛమైన గాలిని పొందే హక్కు ఉంటే, ఇతర నగరాల ప్రజలకు ఎందుకు లేదని ప్రశ్నించారు. ఏ విధానం ఉన్నా అది పాన్-ఇండియా స్థాయిలో ఉండాలి. దేశంలోని ఢిల్లీ కోసం మాత్రమే విధానాన్ని రూపొందించలేం అని జస్టిస్ గవాయ్ అన్నారు.

►ALSO READ | సీఎం సిద్ధరామయ్య సంచలన నిర్ణయం: కర్నాటకలో మరోసారి కుల గణన సర్వే

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వాయు కాలుష్యానికి సంబంధించిన ఎంసీ మెహతా కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఉత్తరప్రదేశ్ ,హర్యానాలోని ఎన్‌సిఆర్ ప్రాంతాలలో బాణసంచా నిషేధాన్ని పొడిగించింది.

గత శీతాకాలంలో తాను అమృత్‌సర్‌కు వెళ్లానని..అక్కడి కాలుష్యం ఢిల్లీ కంటే దారుణంగా ఉందని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. పటాకులను నిషేధించాలంటే అది దేశవ్యాప్తంగా ఉండాలి అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.