కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

న్యూడిల్లీ: జనాభా పెరుగుదలతో దేశంలో ఎదురవుతున్న సమస్యలను తగ్గించేందుకు రూల్స్, రెగ్యులేషన్లను రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషిన్ దాఖలైంది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్​ రాయ్​తో కూడిన బెంచ్.. స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం విపరీతంగా పెరుగుతోందని, అందుకు తగినట్లు ఆహార ధాన్యాలు, ఆరోగ్య సంరక్షణా సౌలత్​లు ఉండట్లేవని ఆలిండియా భారతీయ సంత్ సమితి ప్రధాన కార్యదర్శి జితేంద్రానంద సరస్వతి పిటిషన్​లో పేర్కొన్నారు.

అధిక జనాభాతో లక్షలాది మంది సిటిజన్లకు కూడు, గూడు, విద్య వంటి ప్రాథమిక హక్కులు అందే పరిస్థితులు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతినెలా మొదటి ఆదివారాన్ని ఆరోగ్య దినంగా ప్రకటించి, పేదరికంలో ఉన్న కుటుంబాలకు జనాభా పెరుగుదలలో కలిగే నష్టాలను తెలియజేయాలని కోరారు. జనాభా ఏటా పెరుగుతోంది కానీ, దేశంలో సహజ వనరులు పరిమితమని గుర్తుచేశారు. అమెరికాలో రోజుకు 10 వేల మంది పిల్లలు పుడుతుంటే.. మన దేశంలో 70 వేల మంది పుడుతున్నారని పేర్కొన్నారు.