రెండ్రోజుల వానలకే సిటీలో సీన్ రిపీట్

రెండ్రోజుల వానలకే సిటీలో సీన్ రిపీట్
  • నీళ్లల్ల కాలనీలు
  • రెండ్రోజుల వానలకే హైదరాబాద్​లో నిరుటి సీన్ రిపీట్
  • నీట మునిగిన 50కి పైగా కాలనీలు
  • ఎల్బీనగర్, కాప్రా ప్రాంతాల్లో ఇప్పటికే ఇండ్లు ఖాళీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు నిరుడు వరదల సమయంలో కనిపించిన సీన్​ రిపీట్ అయింది. కొన్ని ఏరియాల్లో10, 11 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఇండ్లలోకి వర్షపు నీరు చేరి వస్తువులు, నిత్యావసర సరుకులు పాడై పోయాయి. వర్షం తగ్గకపోవడంతో కొన్నిచోట్ల జనం రాత్రికిరాత్రి ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. రెండ్రోజులుగా వానలకు హైదరాబాద్​లోని 50 కిపైగా కాలనీల్లో నీరు నిలిచింది. కొన్నిచోట్ల నడుంలోతు, చాలాచోట్ల మోకాళ్ల లోతు వరకు నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీనగర్ లో అత్యధికంగా 11.8 సెంటీమీటర్ల వర్షం కురవడంతో అయ్యప్పకాలనీ మొత్తం నీట మునిగింది. ఇప్పటికే కాలనీలో చాలా మంది ఇండ్లు ఖాళీ చేశారు. ఓనర్లు సైతం నివాసాల్ని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. మౌలాలిలో కురిసిన 10.9 సెంటీమీటర్ల వర్షానికి లాలాపేట్, లక్ష్మీనగర్, ఆనంద్ బాగ్​ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు వచ్చింది. బేగంపేట్​లోని మయూరిమార్గ్, ప్రకాశ్​నగర్ ప్రాంతాల్లోని గ్రౌండ్​ ఫ్లోర్లలో ఉంటున్న జనాలు ఖాళీ చేశారు. టోలిచౌకి, హయత్ నగర్, వనస్థలిపురం, ఉప్పల్​తదితర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. వానలతో వరద ముప్పు ఎప్పుడు ముంచుకొస్తుందోనని సిటీ జనం బిక్కుబిక్కుమని గడుపుతున్నారు.   

బోట్లు తిప్పాల్సిందే..
కొన్ని చోట్ల ముంపు కాలనీల్లో నీరు చేరడంతో ఇండ్లలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో నీటిని తొలగించాలంటూ కొందరు బల్దియా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. భారీ వర్షాలు మరో రెండ్రోజులపాటు కంటిన్యూ అయితే గనుక ముంపు కాలనీల్లోని జనాల్ని తరలించేందుకు బోట్లు తిప్పాల్సిన పరిస్థితే.. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ కూడా ప్రకటించడంతో ముంపు ప్రాంతాల్లో బోట్లు సిద్ధంగా ఉంచాలని  అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. 

ఇప్పటికీ నో చేంజ్..
నిరుడు భారీ వర్షాలు కురిసిన సమయానికి, ఇప్పటికీ ఏ మార్పు కనిపించడం లేదు. భవిష్యత్​లో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రులు అస్సలు పట్టించుకోలేదు. నీళ్లు నిలబడే ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థలో మార్పులు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్తగా పైపులైన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ఎక్కడా అలాంటి చర్యలు తీసుకోలేదు.

మరో నాలుగు రోజులు భారీ వర్షాలు
రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే చాన్స్‌‌ ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. 11, 12 తేదీల్లో ఆరెంజ్‌‌ అలర్ట్‌‌ ప్రకటించామని, ఆయా తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని గురువారం వెల్లడించింది. 11న బంగాళాఖాతంలోని ఉత్తర ఆంధ్రా, ఒడిశా తీరాల దగ్గర అల్పపీడనం ఏర్పడే చాన్స్‌‌ ఉందని వివరించింది. ఇటు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల చెట్లు, కరెంట్‌‌ స్తంభాలు నేలకొరిగాయి. కరెంట్‌‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్‌‌ జిల్లాలోని ఉట్నూరులో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్‌‌లోని లక్ష్మణ్‌‌చాందాలో 12 సెం.మీ., దిళ్వార్‌‌పూర్‌‌, ఆదిలాబాద్‌‌ టౌన్లలో 11, ఆదిలాబాద్‌‌లోని బోథ్‌‌, నిర్మల్‌‌లోని సారంగపూర్‌‌లలో10 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది. పెద్దపల్లిలోని ధర్మారం, జగిత్యాలలోని మల్లాపూర్‌‌, వికారాబాద్‌‌లోని నవాబుపేట, కుమ్రంభీంలోని సిర్పూరు, జైనూరు, జగిత్యాల టౌన్‌‌, నిజామాబాద్‌‌లోని బాల్కొండ, వెల్పూరులలో 9 సెంటీమీటర్ల చొప్పున నమోదైంది.