
- ఈ నెల 29న, వచ్చే నెల1న వాదనలు విననున్న స్పీకర్
హైదరాబాద్, వెలుగు: పార్టీ పిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ నెల 29 న, వచ్చే నెల 1 న స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖాముఖి విచారణ జరపనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు శనివారం విడుదల చేశారు. ఈ నెల 29న ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు.
వచ్చే నెల 1న బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల తరపు అడ్వకేట్లు తమ వాదనలను స్పీకర్ ఎదుట వినిపించనున్నారు. అసెంబ్లీ సెక్రటరీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం...ఈ నెల 29 న జరగనున్న విచారణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై వాదనలు జరుగుతాయి. వచ్చే నెల 1న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, పల్లె రాజేశ్వర్ రెడ్డి పిటిషన్లపై వాదనలు జరగనున్నాయి.