- స్కూళ్లకు వెళ్లి వాహనాలను తనిఖీలు చేస్తున్న అధికారులు
- పారదర్శకతపై వెల్లువెత్తుతున్న అనుమానాలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ తనిఖీల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ఆర్టీఏ కార్యాలయంలో జరగాల్సిన తనిఖీలను కొంతమంది అధికారులు నేరుగా స్కూళ్లకు వెళ్లి నిర్వహిస్తుండటంతో ఫిట్‌నెస్ ప్రక్రియ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఆర్టీఏ కార్యాలయం ఉన్నప్పటికీ కొందరు స్కూల్ యాజమాన్యాలు బస్సులను అక్కడికి పంపడం లేదు.
డ్రైవర్లు అందుబాటులో లేరనే కారణంతో స్కూల్ ప్రాంగణంలోనే తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులకు లేఖలు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో ఎంవీఐలు, ఏఎంవీఐలు నేరుగా పాఠశాలలకు వెళ్లి బస్సులను పరిశీలిస్తున్నారు. ఇటీవల తాండూర్‌లోని ఓ స్కూల్‌తో పాటు మంచిర్యాల ఏసీసీ రోడ్డులో ఉన్న మరో ప్రైవేట్ స్కూల్‌లో కూడా అధికారులు బస్సుల తనిఖీలు నిర్వహించారు.
అయితే కొందరు అధికారులు స్కూల్ యాజమాన్యాలతో కుమ్మక్కై బస్సులను ఆర్టీఏ కార్యాలయానికి రానివ్వకుండా నేరుగా స్కూల్‌లకే వెళ్లి ఫిట్‌నెస్ ప్రక్రియ పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫిట్‌గా లేకున్నా ఫిట్నెస్ సర్టిఫికెట్..
ఈ నెల 21న ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సులను తనిఖీ చేసి, మరుసటి రోజే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు సమాచారం. అయితే సంబంధిత ఇన్‌స్పెక్టర్ ఆ రోజు హెడ్‌క్వార్టర్‌లోనే లేరన్న ప్రచారం జరుగుతోంది. పూర్తిస్థాయి ప్రమాణాలు పాటించని బస్సులకు కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇలా కొన్ని స్కూళ్ల వద్దకే వెళ్లి తనిఖీలు నిర్వహిస్తుండటంతో మిగతా స్కూల్ యాజమాన్యాలు కూడా తమ వద్దకే వచ్చి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఫిట్‌నెస్ తనిఖీల్లో బస్సుల పరిస్థితితో పాటు డ్రైవర్ల సామర్థ్యాన్ని కూడా పరీక్షించాల్సి ఉంటుంది. డ్రైవర్లే అందుబాటులో లేరని చెబుతున్నప్పుడు వారి డ్రైవింగ్ నైపుణ్యాన్ని ఎలా పరిశీలిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొంతమంది అధికారులు రూల్స్‌లోని వెసులుబాట్లను ఆసరాగా చేసుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముందుగానే తనిఖీలు..
మంచిర్యాల జిల్లాలో దాదాపు 300 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉన్నాయి. ప్రతి ఏడాది జూన్ తొలి వారంలో ఫిట్‌నెస్ తనిఖీలు చేపడుతుండగా, ఈసారి ముందుగానే ప్రారంభించారు. గత నాలుగు రోజులుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆర్టీఏ అధికారులు ధాన్యం రవాణా విధుల్లో బిజీగా ఉండటంతో రోజుకు సుమారు 30 బస్సులను మాత్రమే పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు 90 బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన మరో వారం నుంచి పది రోజుల్లో తనిఖీలు పూర్తయ్యే అవకాశం ఉంది.
నిబంధనలు ఇవీ..
రూల్స్ ప్రకారం స్టూడెంట్స్‌ను తరలించే బస్సులు, వ్యాన్లు, ఆటోలను ముందుగా గ్యారేజీలో సాంకేతిక పరీక్షలు చేయించి, సంబంధిత పత్రాలతో ఆర్టీఏ కార్యాలయానికి తీసుకురావాలి. అనంతరం ఎంవీఐ లేదా ఏఎంవీఐ స్వయంగా వాహనాన్ని నాలుగు కిలోమీటర్ల వరకు నడిపించి పూర్తి స్థాయిలో పరిశీలించాలి. బ్రేకులు, సీటింగ్ సామర్థ్యం, ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఫైర్ సేఫ్టీ పరికరాలు వంటి 30కి పైగా ప్రమాణాలను పరిశీలించిన తర్వాతే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలి.
లోపాలు జరిగితే యాక్షన్ తీసుకుంటాం..
నిబంధనల ప్రకారమే స్కూల్ బస్సుల ఫిట్నెస్ తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎవరైనా స్కూల్ యాజమాన్యాలు డ్రైవర్లు అందుబాటులో లేరని లెటర్ ఇస్తే అధికారులు స్కూల్ ప్రాంగణానికి వెళ్లి తనిఖీలు చేపట్టవచ్చు. తనిఖీల్లో ఏమైనా లోపాలు జరిగినట్టు తేలితే సంబంధిత అధికారులపై యాక్షన్ తీసుకుంటాం.
– గోపీకృష్ణ, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, మంచిర్యాల-
