ఎందుకు రా మీకు చదువు: చీపుర్లతో కొట్టి.. బూట్లతో తన్ని..విద్యార్థిపై 9 మంది తోటి విద్యార్థుల దాడి.. హైదరాబాద్ లో ఘటన

ఎందుకు రా మీకు చదువు: చీపుర్లతో కొట్టి.. బూట్లతో తన్ని..విద్యార్థిపై 9 మంది తోటి విద్యార్థుల దాడి..  హైదరాబాద్ లో ఘటన
  •    బాధితుడికి తీవ్రగాయాలు

జవహర్ నగర్, వెలుగు: దమ్మాయిగూడ డివిజన్‌‌‌‌లోని ఓ ప్రైవేట్  స్కూల్‌‌‌‌లో దారుణం జరిగింది. తొమ్మిది మంది విద్యార్థులు కలిసి మరో విద్యార్థిపై దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఏరోళ్ల కిరణ్ కుమార్, శోభ దంపతుల కొడుకు అభిషేక్.. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య స్కూల్​లో పదో తరగతి చదువుతున్నాడు. 

ఈ నెల 7న అర్ధరాత్రి విఘ్నేష్‌‌‌‌తోపాటు మరో తొమ్మిది మంది గ్యాంగ్‌‌‌‌గా ఏర్పడి అభిషేక్‌‌‌‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అభిషేక్ వీపు, ముఖం భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. మీ కొడుకు మెట్లపై నుంచి పడ్డాడంటూ మరుసటి రోజు యాజమాన్యం తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం అందించింది. వెంటనే పాఠశాల వద్దకు వచ్చి చూడగా, అభిషేక్ నడవలేని స్థితిలో ఉన్నాడు. 

ఇంటికి తీసుకెళ్లాక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పాడు. తనపై తొమ్మిది మంది కలిసి కర్రలు, చీపుర్లతో కొట్టి, బూట్లతో తన్ని దాడి చేశారని తెలిపాడు. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్కూల్​కు వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు.

దాడి ఘటనను పరిశీలించాలని కోరగా సీసీ కెమెరాలు లేవని యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో అభిషేక్ తల్లిదండ్రులు జవహర్​నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెడ్, భోజనం విషయంలో ఈ గొడవ జరిగి ఉండవచ్చని జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, ఎస్​హెచ్​వో సైదులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.