
ఎస్టీఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: టెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నుంచి ఇన్-సర్వీస్ టీచర్లకు రక్షణ కల్పించేందుకు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెట్ సిలబస్, అర్హత ప్రమాణాలను శాస్త్రీయంగా సవరించాలని కోరారు.
ఆదివారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. రవి మాట్లాడుతూ..సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఐదేళ్ల పైబడి సర్వీసు ఉన్న ఇన్-సర్వీస్ టీచర్లందరూ రెండేళ్లలో టెట్ పాస్ కావాలని, లేకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాలని చెప్పిందని గుర్తుచేశారు. అయితే, 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన టీచర్లకు టెట్ మినహాయింపు ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, కానీ.. 15 ఏండ్ల తర్వాత హఠాత్తుగా పరీక్ష పాస్ కావాలని చెప్పడం సీనియర్ టీచర్లలో ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఈ సంక్షోభాన్ని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేయాలని కోరారు. రెండేళ్లలో వీలైనన్ని ఎక్కువ సార్లు టెట్ నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ కోరారు.