బస్సును ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్.. యూపీలో నలుగురు దుర్మరణం

బస్సును ఢీ కొట్టిన స్కూల్ వ్యాన్.. యూపీలో నలుగురు దుర్మరణం

బుదౌన్ (యూపీ): ఉత్తరప్రదేశ్​లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లలను స్కూలుకు తీసుకెళుతున్న ఓ వ్యాన్ అదుపుతప్పి కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ తో పాటు ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. బుదౌన్‌‌ జిల్లాలోని నవీగంజ్ గ్రామ సమీపంలో సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్కూల్​వ్యాన్ ​డ్రైవర్..​ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే ప్రయత్నంలో వ్యాన్ కంట్రోల్ తప్పింది. ఎదురుగా వస్తున్న కాలేజీ బస్సును ఢీకొట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

ఆ సమయంలో వ్యాన్​లో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనపై బుదౌన్​కలెక్టర్​ మనోజ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను జిల్లా ఆసుపత్రి, ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో చేర్పించినట్లు తెలిపారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ యాక్సిడెంట్​పై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు.