చెన్నైలో భారీ వర్షాలు .. నవంబర్‌‌ 28న స్కూళ్లు బంద్ 

చెన్నైలో భారీ వర్షాలు .. నవంబర్‌‌ 28న  స్కూళ్లు బంద్ 
  • రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మూడ్రోజులు వర్షాలు  

చెన్నై :  తమిళనాడులోని చెన్నై, దాని పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం చెన్నైతోపాటు చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో చెన్నై శివార్లలోని పెరుంగుడి సహా ఇతర లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వర్షపు నీళ్లు చేరాయి. వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అనేక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని, ఎమర్జెన్సీ సర్వీసుల సిబ్బంది హైఅలర్ట్​గా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ప్రజలంతా ఇండ్లల్లోనే ఉండాలని, తప్పనిసరి అయితేనే తగిన జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురంతోపాటు తిరువల్లూర్ జిల్లాలోనూ స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవును ప్రకటించింది. బుధవారం ఉదయం నుంచి 12 గంటల్లో చెన్నైలోని మీనంబాక్కంలో 71 మి.మీ., నుంగంబాక్కంలో 56 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

వర్షాల వల్ల ఆటోమేటిక్ సిగ్నల్స్ క్రాష్ అయ్యాయని, ఫలితంగా లోకల్ ట్రైన్ సర్వీసులు ఆలస్యం అయ్యాయని అధికారులు తెలిపారు. కాగా, డిసెంబర్ 2, 3వ తేదీల్లో చెన్నైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా గురువారం నుంచి మూడు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.