రాష్ట్రంలో బడులు అధ్వానం

రాష్ట్రంలో బడులు అధ్వానం
  • దేశంలో కింది నుంచి 7వ స్థానం 
  • ఏపీకి 902 పాయింట్లు .. తెలంగాణకు 754 
  • 2020‑21 పీజీఐ రిపోర్టు విడుదల చేసిన కేంద్రం

హైదరాబాద్/ఢిల్లీ, వెలుగు: తెలంగాణలో స్కూళ్లు అధ్వానంగా ఉన్నాయని మరోసారి స్పష్టమైంది. విద్యారంగంలో పనితీరులో రాష్ట్రం దేశంలో కింది నుంచి 7వ స్థానంలో నిలిచింది. 2020–21 విద్యా సంవత్సరానికి గాను స్కూల్ ఎడ్యుకేషన్ లో రాష్ర్టాలు, యూటీల పనితీరుపై కేంద్ర విద్యా శాఖ పర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) రిపోర్టులో గ్రేడింగ్ పాయింట్లు ప్రకటించింది. మొత్తం 70 అంశాలకు వెయ్యి పాయింట్లను కేటాయించగా.. తెలంగాణ 754 పాయింట్లు మాత్రమే సాధించింది. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ర్టాలు 928 పాయింట్లతో రెండో గ్రేడ్ సాధించాయి. 716 పాయింట్లతో మేఘాలయ, 669 పాయింట్లతో అరుణాచల్ ప్రదేశ్ చివరిస్థానంలో  (10వ గ్రేడ్) ఉన్నాయి. పీజీఐ రిపోర్టు తయారీకి 70 ఇండికేటర్లకు గాను1000 పాయింట్లను కేటాయించారు. ఇండికేటర్లను ఫలితాలు (ఔట్ కమ్స్), పరిపాలనా నిర్వహణ (గవర్నెన్స్ మేనేజ్ మెంట్) అనే రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఔట్ కమ్స్​ కేటగిరిలో  లర్నింగ్ ఔట్ కమ్స్, యాక్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్, ఈక్వాలిటీ అంశాలను  చేర్చారు. మొత్తంగా ఈ రెండు గ్రూపుల్లో పనితీరు ఆధారంగా పాయింట్లు ఇచ్చి గ్రేడింగ్ కేటాయించారు. మొత్తం స్కోర్​ను 8 లెవెల్స్​గా గుర్తించారు. స్కోర్​ను లెవెల్ 1లో 951– 1000 పాయింట్లు, లెవెల్ 2లో 901–950, లెవెల్ 3లో 851–900, లెవెల్ 4లో 801–850, లెవెల్ 5లో 751–800, లెవెల్ 6లో 701–750, లెవెల్ 7లో 651–700, లెవెల్ 8లో 601–650 పాయింట్లు ఇచ్చారు. లెవెల్1, 8లో ఒక్క రాష్ట్రం కూడా లేదు. లెవెల్ 2లో ఏపీ, చండీగఢ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ నిలిచాయి. లెవెల్ 3లో 12 రాష్ర్టాలు ఉన్నాయి. లెవెల్ 5లో తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ర్టాలున్నాయి. 

బీహార్ కంటే ఘోరం..

పీజీఐ రిపోర్టులో బీహార్​ 773 పాయింట్లతో మన కంటే ముందుంది. తెలంగాణ తర్వాత సిక్కిం(751),  మణిపూర్(741), నాగాలాండ్ (728), ఉత్తరాఖండ్ (719), మేఘాలయ (716), అరుణాచల్ ప్రదేశ్ (669) లాంటి చిన్న రాష్ర్టాలు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. తెలంగాణ 2019–20లో 772 పాయింట్లు సాధిస్తే, ఈ ఏడాది754 పాయింట్లకు దిగజారింది. ఈక్విటీ, గవర్నెన్స్ ప్రాసెస్ విభాగాల్లో కేంద్ర సరాసరి కంటే మైనస్ పాయింట్లలో రాష్ట్రం నిలిచింది. బడుల్లో టీచర్లు లేకపోవడం, నిధుల కేటాయింపు, సింగిల్ టీచర్ స్కూల్స్ తదితర అంశాలతో తెలంగాణ స్థాయి మరింతగా దిగజారింది.