నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు ఓపెన్!

నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు ఓపెన్!
  • ముందుగా నైన్త్‌, టెన్త్‌స్టూడెంట్స్ కు క్లాసులు
  • తర్వాత పరిస్థితిని బట్టి అప్పర్​ ప్రైమరీ, ప్రైమరీ తరగతులు
  • వచ్చే నెల 2 నుంచి స్కూళ్లు!

రాష్ట్రంలో స్కూళ్లన్నింటినీ రీఓపెన్​ చేసేందుకు ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​ రెడీ అవుతోంది. ఈ నెల 15 తర్వాతి నుంచి బడులు ప్రారంభించుకోవచ్చని కేంద్రం సూచించడం, ఈ అంశంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను రాష్ట్రాలకే ఇవ్వడంతో.. మన దగ్గర ఎప్పుడు మొదలుపెట్టాలనే దానిపై దృష్టి పెట్టింది. ఈ నెలాఖరులో బతుకమ్మ దసరా పండుగలు ఉండటంతో.. వచ్చే నెల ప్రారంభంలో స్కూళ్లు ఓపెన్​ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. మొదట హైస్కూల్​ క్లాసులు స్టార్ట్​ చేయాలని, తర్వాత పరిస్థితిని బట్టి అప్పర్​ ప్రైమరీ, ప్రైమరీ క్లాసులను మొదలుపెట్టాలని భావిస్తోంది.

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో వచ్చే నెల 2 నుంచి స్కూళ్లు ఓపెన్‌‌ కానున్నాయి. తెలంగాణలో మొత్తం 40 వేలకు పైగా స్కూళ్లు​ఉండగా.. 58 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. కరోనా ఎఫెక్ట్​తో మార్చిలోనే స్కూళ్లన్నీ మూతపడ్డాయి. సాధారణంగా వేసవి తర్వాత జూన్  రెండో వారంలో స్కూళ్లు రీఓపెన్​ కావాలి. కానీ ఆరు నెలలు దాటినా కరోనా ఎఫెక్ట్​ ఉండటంతో మూసే ఉంచారు. స్టూడెంట్లు నష్టపోవద్దనే ఉద్దేశంతో కేంద్రం ఆన్​లైన్ క్లాసులను అనుమతించింది. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి దూరదర్శన్, టీశాట్ ద్వారా డిజిటల్, ఆన్​లైన్ క్లాసులు మొదలుపెట్టారు. అయితే అన్​లాక్ 4 గైడ్ లైన్స్ ప్రకారం.. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టూడెంట్స్ డౌట్స్ క్లారిఫై కోసం బడులకు వచ్చేందుకు, సగం మంది టీచర్లు బడులకు హాజరయ్యేందుకు కేంద్రం అనుమతించింది. కానీ రాష్ట్రంలో మాత్రం 50 శాతం టీచర్ల రూల్​ మాత్రమే అమలు చేస్తున్నారు. కరోనా కేసులు ఇంకా పెరుగుతుండటంతో స్టూడెంట్స్​బడులకు వచ్చేందుకు అవకాశం ఇవ్వలేదు. తాజాగా అన్​లాక్ 5 గైడ్​ లైన్స్  రిలీజ్ చేసిన కేంద్రం.. ఈ నెల 15 తర్వాత స్కూళ్లు ప్రారంభించుకోవచ్చని పేర్కొంది.

పండుగలు దాటాకే..

బడుల రీఓపెన్​కు కేంద్రం పర్మిషన్ ఇచ్చినా.. రాష్ట్రంలో ఆ తేదీన ప్రారంభించేందుకు ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​రెడీగా లేదని తెలుస్తోంది. ఈ నెల16 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుండగా..24న సద్దుల బతుకమ్మ, 25న దసరా పండుగ ఉంది. దీంతో స్టూడెంట్లను బడులకు రప్పించే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన ఆదివారం ఉండటంతో.. ఆ మరునాటి (2వ తేదీ) నుంచి స్కూళ్లు ప్రారంభించాలని, అప్పటి వరకు బడుల్లో అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పనున్నట్టు సమాచారం. అయితే మొదట 9, 10 తరగతుల స్టూడెంట్లకు క్లాసులు ప్రారంభించాలని.. కొద్దిరోజుల తర్వాత అప్పర్​ ప్రైమరీ, ప్రైమరీ క్లాసులు స్టార్ట్​ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.