కరోనాపై పోరాడే 65 జీన్స్ ను గుర్తించిన సైంటిస్టులు

కరోనాపై పోరాడే 65 జీన్స్ ను గుర్తించిన సైంటిస్టులు
  • ఇండో అమెరికన్ సైంటిస్ట్ బృందం రీసెర్చ్  
  • కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ దిశగా ముందడుగు 

వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాడే 65 ప్రత్యేక జీన్స్ (జన్యువులు)ను ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్ ఆధ్వర్యంలోని బృందం గుర్తించింది. ఈ జీన్స్ పై సమగ్రంగా అధ్యయనం చేయడం ద్వారా వైరస్ ను నివారించేందుకు కొత్త మార్గాలు దొరుకుతాయని, కరోనాకు సమర్థమైన ట్రీట్ మెంట్ చేసేందుకు వీలవుతుందని కాలిఫోర్నియాలోని శాన్ ఫోర్డ్ బర్ న్హామ్ ప్రెబీస్ మెడికల్ డిస్కవరీ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ సుమిత్ కె. చంద వెల్లడించారు. మన శరీరంలో వైరస్ లకు వ్యతిరేకంగా పోరాడే ఇంటర్ ఫెరాన్స్ (సిగ్నలింగ్ ప్రొటీన్స్) గ్రూపులోకి వచ్చే 65 ఇంటర్ ఫెరాన్ స్టిమ్యులేటెడ్ జీన్స్ (ఐఎస్జీలు)ను తాము గుర్తించామన్నారు. ‘ఈ ఐఎస్జీ జీన్స్ లో కొన్ని కరోనా వైరస్ మన శరీర కణాల్లోకి ప్రవేశించకుండా దెబ్బతీస్తున్నాయి. మరికొన్ని జీన్స్ వైరస్ కు అతి కీలకమైన ఆర్ఎన్ఏ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. మరికొన్ని జీన్స్ వైరస్ భాగాలు ఒకదానితో ఒకటి చేరకుండా నివారిస్తున్నాయి. అలాగే కొన్ని జీన్స్ ఫ్లూ, వెస్ట్ నైల్, హెచ్ఐవీ వంటి వైరస్ లను కూడా అణిచి వేస్తున్నాయి’ అని సుమిత్ వివరించారు. వీరి రీసెర్చ్ వివరాలు ‘మాలిక్యులర్ సెల్’ జర్నల్ లో పబ్లిష్ అయ్యాయి.