కవచ్లో ‘ప్లగ్- అండ్- ప్లే’ స్టాండర్డ్ కోసం ఒప్పందం..

కవచ్లో ‘ప్లగ్- అండ్- ప్లే’ స్టాండర్డ్ కోసం ఒప్పందం..
  •     ఐఐటీ హైదరాబాద్​తో ఐఆర్ఎస్ఈటీ, దక్షిణ మధ్య రైల్వే ఎంవోయూ

హైదరాబాద్, వెలుగు: భారతీయ రైల్వేల స్వదేశీ కవచ్ (ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్) వ్యవస్థలోని వేర్వేరు భాగాల(మాడ్యూల్స్)ను ఒకదానికొకటి ప్లగ్-అండ్-ప్లేలా పనిచేయించడానికి సంబంధించి ఓ ఒప్పందం జరిగింది. కవచ్ వ్యవస్థలో ఏ కొత్త భాగం పెట్టినా సిస్టమ్ ఆటోమేటిక్‌‌‌‌గా గుర్తించి, ఆగకుండా రన్ అయ్యేలా చేయడానికి దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్), ఇండియన్ రైల్వేస్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఐఆర్ఎస్ఈటీ)సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐఐటీ-హైదరాబాద్ మధ్య ఎంవోయూ కుదిరింది. ఇకపై ఏ కంపెనీ తయారు చేసిన భాగం అయినా ప్లగ్ లాగా పెట్టగానే  కవచ్ వ్యవస్థ పని మొదలవుతుంది. 

ఇందుకోసం ఎలాంటి సెటప్,  అప్‌‌‌‌గ్రేడ్ అవసరం ఉండదు. ఎస్సీఆర్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్, టెలికాం ఇంజనీర్ పీవీ మురళీ కృష్ణ, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి సమక్షంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ (ప్రాజెక్ట్స్/కోఆర్డినేషన్) తేజ్ ప్రకాశ్ అగర్వాల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయ్ సెర్వాల్, ఐఐటీ హైదరాబాద్ విభాగాధిపతి ప్రొఫెసర్ నరహరి శాస్త్రి ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా ఐఐటీ హైదరాబాద్.. కవచ్ వ్యవస్థ కోసం మాడ్యూలర్ హార్డ్‌‌‌‌వేర్ స్థాయిలో ఇంటర్‌‌‌‌ ఆపరేబిలిటీని అభివృద్ధి చేయనుంది. పరికరాల తయారీదారుతో సంబంధం లేకుండా  కవాచ్ వ్యవస్థలోని వివిధ ఫంక్షనల్ మాడ్యూళ్ల మధ్య ప్లగ్-అండ్-ప్లే అనుకూలతను ప్రారంభించనుంది.