- రూ.లక్షన్నర జీతం వస్తున్నా కక్కుర్తి
- ఇసుక లారీలకు అమ్మకం
- అధికారుల అండతోనేనా?
దిల్సుఖ్ నగర్, వెలుగు : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లోని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పరిధిలో గార్బేజ్వాహనాల్లో డీజిల్ దొంగతనం చేస్తున్నారు. ఎల్బీనగర్ సర్కిల్ ఆఫీసులోని పార్కింగ్ యార్డులో గార్బేజ్ వెహికిల్స్ డ్రైవర్స్ అయిన ఓ పర్మినెంట్ ఉద్యోగి, మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి యథేచ్ఛగా గార్బేజ్ వాహనాల్లో డీజిల్ దొంగిలించి, ఇసుక లారీలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రతి వాహనానికి లెక్క చూసి డీజిల్ కూపన్లు ఇచ్చే ఏఈ ప్రతి రోజూ డీజిల్చోరీకి గురవుతున్నా ఏ లెక్కన కూపన్లు ఇస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
లక్షకు పైగా జీతం.. అయినా కక్కుర్తి
హయత్నగర్సర్కిల్ పర్మినెంట్ ఉద్యోగి డ్రైవర్ కృష్ణకు నెలకు లక్ష నలభై వేల జీతం ఉంటుంది. అయినా, అదనపు డబ్బు కోసం కక్కుర్తి పడ్డాడు. ఇతడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీశైలంతో కలిసి రోజూ ఉదయం 5 గంటలకు గార్బేజ్ వాహనాల్లోని డీజిల్ ను తీసి క్యాన్లలో నింపి ఇసుక లారీలకు అమ్ముకుంటున్నాడు. అలాగే గార్బేజ్ లేబర్ గా విధుల్లో ఉండాల్సిన ఓ ఔట్సోర్సింగ్కార్మికుడు కొందరి అండదండలతో సూపర్వైజర్గా ఛలామణి అవుతున్నాడని, అయినా పట్టించుకోవడం లేదంటున్నారు. గతంలో ఓ గ్రామ ఉపసర్పంచ్ గా ఉండి ఔట్సోర్సింగ్లేబర్గా జీతం తీసుకున్నాడని అంటున్నారు.
