అట్రాసిటీ కేసుల్లో.. ఎస్సీ, ఎస్టీలకు పరిహారం ఇస్తలేరు

అట్రాసిటీ కేసుల్లో.. ఎస్సీ, ఎస్టీలకు పరిహారం ఇస్తలేరు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను సర్కారు పట్టించుకుంటలేదు. దళిత, గిరిజనులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌‌ కింద ఇచ్చే పరిహారం ఇవ్వడం లేదు. మూడు నెలలుగా రిలీఫ్‌‌ పూర్తిగా బంద్‌‌ చేశారు. ప్రొసీడింగ్స్‌‌ అన్నీ పూర్తయినా ఫైనాన్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌లో చెక్కులు ఆపుతున్నరు. ఎస్సీ, ఎస్టీల బాధితలకు ఇవ్వాల్సిన పైసలను పక్కదారి పట్టిస్తున్నారని దళిత, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు ఎస్సీ, ఎస్సీలపై దాడులు పెరిగిపోతున్నాయి. చిన్నచిన్న ఘటనతో మొదలుకొని బాలికలు, అమ్మాయిలపై రేప్‌‌, మర్డర్‌‌ వరకు ఇన్సిడెంట్స్‌‌ జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌‌ ప్రకారం ఎఫ్‌‌ఐఆర్‌‌ కాగానే రిలీఫ్‌‌ అండ్‌‌ రిహాబిటేషన్‌‌ కింద మొదట మైనర్​అయితే 25 శాతం, మేజర్‌‌ అయితే 50 శాతం రిలీఫ్‌‌ ఇస్తారు. ఈ పరిహారం కూడా వారంలోగా ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా  మొత్తం ఛార్జీషీట్‌‌ ఫైల్​అయ్యాక అందజేయాలి. రేప్‌‌, మర్డర్‌‌ అడిషనల్‌‌ రిలీఫ్‌‌ కింద కుటుంబానికి మూడు నెలలకు సరిపడా రేషన్‌‌ అందించాలి. మూడు నెలల్లోపు అర్హతను బట్టి కుటుంబలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, గ్రామీణ ప్రాంతాలవారైతే మూడెకరాల భూమి ఇవ్వాలి. దీంతో పాటు ఇంట్లో పెద్ద మనిషి ఉంటే పెన్షన్‌‌ ఇవ్వాలి. జీవో13 ప్రకారం ఇవన్నీ మూడు నెలల్లోపే ఇవ్వాలి. కానీ రాష్ట్రంలో నిబంధనల ప్రకారం ఒక్క కేసులో కూడా ఇప్పటి వరకు బాధితుడికి పరిహారం ఇవ్వలేదు.

మూడు నెలలుగా చెక్కులు బంద్‌‌..
ఎఫ్‌‌ఐఆర్‌‌ నమోదయ్యాక బాధితులకు ఇచ్చే పరిహారంపై సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గతంలో ప్రొసీడింగ్స్‌‌ పూర్తయ్యాక వెంటనే ఆర్థిక సాయం అందేది. కానీ మూడు నెలలుగా దీన్ని పూర్తిగా నిలిపేశారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు సాయం విషయంలో ఎలాంటి ఆలస్యం చేయకూడదని గతంలో ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా ఉన్నాయి. కానీ అధిక శాతం ఫైల్స్‌‌ ఆర్థిక శాఖలోనే ఆగుతుండటం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల మంది బాధితుల చెక్కులు పెండింగ్‌‌లో ఉన్నట్లు తెలిసింది. ఒక్క హైదరాబాద్‌‌ జిల్లా పరిధిలోనే 87 మంది చెక్కులు పెండింగ్‌‌లో ఉన్నాయి. 

పైసలు పక్కదారి..!
ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాల్సి నిధులను సర్కారు పక్కదారి పట్టిస్తోందని దళిత, గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. బాధితులకు అందించే సాయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50 : 50 వాటా చెల్లిస్తున్నాయి. అయితే కేంద్రం తన వాటాను ఎప్పటికప్పుడు రిలీజ్‌‌ చేస్తున్నా.. రాష్ట్ర సర్కారు మాత్రం కేంద్రం ఇచ్చిన వాటితోపాటు తన షేర్‌‌ను కూడా వాడుకుంటోంది. దీంతో బాధితులకు సాయం అందడంలో ఆలస్యమవుతోంది.

ఉద్దేశపూర్వకంగానే..
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌‌ను నిర్వీర్యం చేస్తోంది. రేప్‌‌, మర్డర్‌‌ కేసుల్లో బాధితులకు సాయం ఇస్తలేదు. మూడు నెలలుగా పూర్తిగా బంద్‌‌ చేశారు. కేంద్రం తన వాటా ఇచ్చినా రాష్ట్రం పైసలను పక్కదారి పట్టిస్తోంది. దీనిపై నేషనల్‌‌ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌కు ఫిర్యాదు చేస్తం.
– బత్తుల రాంప్రసాద్‌‌, మాల సంక్షేమ సంఘం, స్టేట్‌‌ ప్రెసిడెంట్‌‌