బషీర్‌బాగ్, వెలుగు: ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కీలక భూమిక పోషిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో కమిషన్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బషీర్‌బాగ్‌లోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ బక్కి వెంకటయ్య మూడేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన అభినందన సభకు మంత్రి హాజరై, ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించారు.
బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అణగారిన వర్గాల హక్కుల రక్షణకు వెంకటయ్య అందించిన సేవలను కొనియాడారు. చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగినప్పుడు కమిషన్ బాధితులకు అండగా నిలిచిందని తెలిపారు. గత కమిషన్లకు భిన్నంగా తన సారథ్యంలో 33 జిల్లాల్లో పర్యటించి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి, రక్షణకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కమిషన్ సభ్యులు నీలాదేవి, రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణుగుంట్ల ప్రవీణ్, జిల్లా శంకర్, బీఎంఐ రాష్ట్ర అధ్యక్షుడు సర్వయ్య పాల్గొన్నారు.
