‘టైటాన్’  రెస్క్యూకు కౌంట్​డౌన్

‘టైటాన్’  రెస్క్యూకు కౌంట్​డౌన్

బోస్టన్: అట్లాంటిక్ మహా సముద్రంలో గల్లంతైన మినీ జలాంతర్గామి(సబ్​మెర్సిబుల్ క్రాఫ్ట్) టైటాన్ కోసం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు.. సోమవారం నుంచే రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. మంగళవారం నాటికి అమెరికా కోస్ట్​ గార్డ్​కు కెనడా కోస్ట్ గార్డు బృందాలు తోడయ్యాయి. ప్రైవేటు సంస్థల తరఫున కూడా పలు బృందాలు గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.

ఇందులో భాగంగా మరో మినీ జలాంతర్గామిని సముద్రంలోకి పంపించారు. ఇక అట్లాంటిక్ మహా సముద్రంలో టైటాన్ గల్లంతైన చోట అమెరికా, కెనడాలకు చెందిన విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. టైటాన్ మినీ జలాంతర్గామి కోసం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న ప్రతీ ఒక్కరికీ ఓషియన్ గేట్​ కంపెనీ ధన్యవాదాలు తెలిపింది. టైటాన్ లోని టూరిస్టులు, తమ సిబ్బంది క్షేమ సమాచారం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, టైటాన్ మినీ జలాంతర్గామిలో నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వ ఉంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఆదివారం టైటాన్ ప్రయాణం మొదలైందని, ఇప్పటి వరకు 48 గంటలపైనే గడిచిపోయిందని వివరించారు. ఈ నేపథ్యంలో గడిచే ప్రతీ క్షణం కూడా రెస్క్యూ ఆపరేషన్​లో ఎంతో కీలకమని తెలిపారు.

ఏం జరిగింది..

అమెరికాకు చెందిన ఓషియన్ గేట్​ఎక్స్ పెడిషన్స్ కంపెనీ అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో పర్యాటక యాత్ర చేపట్టింది. సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను చూపించి తీసుకొచ్చేందుకు ‘టైటాన్’ అనే మినీ జలాంతర్గామిని తిప్పుతోంది. ఆదివారం చేపట్టిన యాత్రలో ముగ్గురు టూరిస్టులు, ఇద్దరు సిబ్బందితో కలిసి టైటాన్ ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత రెండు గంటల్లోనే టైటాన్​తో సంబంధాలు తెగిపోయాయి. ఆదివారం రాత్రికి తిరిగి తీరానికి రావాల్సిన టైటాన్.. సోమవారం ఉదయానికి కూడా చేరుకోలేదు.

టైటాన్​లో ఉన్న పర్యాటకులు వీళ్లే..

దుబాయ్​లో  నివాసం ఏర్పరుచుకున్న  బ్రిటీష్​ బిజినెస్ మ్యాన్ హమీష్​ హార్డింగ్ లండన్​లో ఉంటున్న పాకిస్తాన్ వ్యాపారవేత్త షహజాదా దావూద్, ఆయన కొడుకు సులేమాన్, ఓషియన్ గేట్​ వ్యవస్థాపకుడు, సీఈవో స్టాక్టన్ రష్, టైటాన్  పైలట్​ పౌల్​ హెన్రీ ఉన్నారు.

మిస్సింగ్ వివరాలు..

ఆదివారం ఉదయం 6 గంటలకు టైటాన్ ప్రయాణం మొదలైంది(ఇండియాలో ఆదివా రం మధ్యాహ్నం 3:30 గంటలు). ఐదుగురు వ్యక్తులకు 4 రోజుల పాటు అవసరమయ్యే ఆక్సిజన్ టైటాన్​లో నింపి పంపించారు. టైటాన్ గల్లంతై ఇప్పటికే(మంగళవారం నాటికి) 48 గంటలు గడిచిపోయాయి. మరో 48 గంటల్లోగా టైటాన్ ఆచూకీని గుర్తించకపోతే అందులో ఉన్నవారికి ముప్పు తప్పదు. దీంతో రెస్క్యూ ఆపరేషన్​లో వేగం పెంచారు. కాలంతో పోటీపడి వెతుకుతున్నారు.