- ఇక కబడ్డీ కూత
- నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 8
- బరిలో 12 టీమ్స్
బెంగళూరు: ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తోన్న ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) వచ్చేసింది. దాదాపు 20 నెలల బ్రేక్ తర్వాత పీకేఎల్ ఎనిమిదో సీజన్ బుధవారం షురూ అవుతోంది. మొత్తం 12 జట్లు బరిలో నిలిచాయి. కరోనా ప్రోటోకాల్స్ నేపథ్యంలో లీగ్ మొత్తాన్ని బెంగళూరులోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో ఫ్యాన్స్ లేకుండా నిర్వహిస్తున్నారు. ఫస్ట్ డే మాజీ చాంపియన్లు బెంగళూరు బుల్స్, యు ముంబా మధ్య జరిగే మ్యాచ్‌తో పీకేఎల్-8 షురూ కానుంది. అనంతరం జరిగే పోరులో తెలుగు టైటాన్స్.. తమిళ్ తలైవాస్‌ను ఢీ కొట్టనుంది. మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాతో పోటీ పడనుంది. ఈ సీజన్‌లో తొలి నాలుగు రోజులు మూడేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఆపై ప్రతీ శనివారం కూడా 3 మ్యాచ్‌లు షెడ్యూల్ చేశారు.
రోహిత్ కెప్టెన్సీలో టైటాన్స్ హిట్ అవుతుందా?
తెలుగు టైటాన్స్‌పై ఈసారి భారీ అంచనాలున్నాయి. తొలి టైటిల్ ముచ్చట తీర్చుకోవడమే టార్గెట్‌గా టైటాన్స్ బలమైన జట్టును రెడీ చేసుకోవడమే ఇందుకు కారణం. 2018లో బెంగళూరు బుల్స్‌ను విజేతగా నిలిపిన స్టార్ రైడర్ రోహిత్ కుమార్‌ను టీమ్‌లోకి తీసుకున్న టైటాన్స్ అతనికే కెప్టెన్సీ అప్పగించింది. పీకేఎల్‌తో పాటు ఇండియాకు ఆడిన రోహిత్‌కు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సూపర్ రైడ్స్‌తో పాటు కోర్టులో చాలా కూల్‌గా ఉంటూ పక్కా ప్లాన్స్ వేయడంలో తను దిట్ట. రోహిత్‌తోపాటు రూ. 1.30 కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకున్న మరో టాప్ రైడర్ సిద్ధార్ద్ దేశాయ్, పై టైటాన్స్ భారీ ఆశలు పెట్టుకుంది. లాస్ట్ సీజన్‌లో ఆకట్టుకోలేకపోయిన సిద్ధార్ద్ ఈసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్‌లో మన్‌జీత్, ప్రపంజన్‌తో బలమైన డిఫెన్స్ కలిగిన తలైవాస్ నుంచి టైటాన్స్‌కు పరీక్ష ఎదురుకానుంది.
నేటి మ్యాచ్‌లు
బెంగళూరు x యు ముంబా – రా. 7:30
తెలుగు టైటాన్స్ x తలైవాస్ – రా. 8:30
బెంగాల్ x యూపీ యోధా – రా. 9:30
స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్, మా గోల్డ్‌లో లైవ్..
