- బీజేపీకి 27, పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 సీట్లు
- వివరాలు వెల్లడించిన పళనిస్వామి
న్యూఢిల్లీ: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఊపందుకుంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఆల్ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏఐఏడీఎంకే) నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తాజాగా సీట్ల పంపకాలు ఖరారయ్యాయి.
బీజేపీకి 27 స్థానాలు, పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 సీట్లను కేటాయించినట్లు ఏఐఏడీఎంకే సోమవారం వెల్లడించింది. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి కె.పళనిస్వామి వివరాలు వెల్లడించారు. బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్, ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ తదితర నేతలతో భేటీ అనంతరం పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. సీట్ల పంపకాల చర్చలు సాఫీగా సాగాయని, ఏ పార్టీ ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
- 210 స్థానాల్లో విజయం సాధిస్తాం
మొత్తం 234 స్థానాలకు ఏఐఏడీఎంకే కూటమి కనీసం 210 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. తమ కూటమి ఆత్మీయ బంధంతో కూడుకున్నదని, ఇది విజయవంతమైన కలయిక అని అభివర్ణించారు. ‘మా కూటమి గెలుస్తుంది. ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. డీఎంకేను అధికార పీఠం నుంచి దించడమే మా లక్ష్యం’ అని అన్నారు.
డీఎంకే–కాంగ్రెస్ మధ్య జరుగుతున్న సీట్ల పంపకాల చర్చల్లో నెలకొన్న జాప్యాన్ని, వారి మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని పళనిస్వామి ఎద్దేవా చేశారు. 2021లో ఆరు సీట్లు సాధించిన సీపీఐ(ఎం), ఇప్పుడు ఐదు స్థానాల కోసం కూడా కష్టపడుతోందని ఎద్దేవా చేశారు. సీట్ల పంపకాల విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు తాను ఢిల్లీ వెళ్లడంపై డీఎంకే చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్వేశారు.
డీఎంకే ఎంపీ కనిమొళి ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎందుకు కలిశారని ప్రశ్నించారు. ఎన్డీయే నేతలు ఢిల్లీకి వెళ్తే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అసత్య ప్రచారాలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని ఆరోపించారు. ‘‘మేము ఢిల్లీకి వెళ్తే సీఎం భయపడుతున్నారు’’ అని పళనిస్వామి ఎద్దేవా చేశారు.
