లిక్కర్​ స్కామ్​లో రెండో అరెస్టు

లిక్కర్​ స్కామ్​లో రెండో అరెస్టు
  • ఢిల్లీకి చెందిన ఇండో స్పిరిట్​ ఎండీ సమీర్​ మహేంద్రు అరెస్ట్ 
  • రాష్ట్ర నేతల్లో మొదలైన వణుకు
  • రామచంద్ర పిళ్లైతో సమీర్​కు వ్యాపార లింకులు
  • రూ.కోట్లు చేతులు మారినట్లు అనుమానాలు
  • ఇటీవల శ్రీనివాస్​రావు విచారణలో కీలక ఆధారాలు లభ్యం
  • వాటితో ముందుకు వెళ్తున్న ఈడీ.. త్వరలో మరిన్ని అరెస్టులు

హైదరాబాద్‌‌, వెలుగు: ఢిల్లీ లిక్కర్​ స్కామ్​లో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో మంగళవారం ముంబైకి చెందిన విజయ్​ నాయర్​ను సీబీఐ అరెస్ట్​ చేయగా.. బుధవారం ఇండో స్పిరిట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ ఎండీ సమీర్​ మహేంద్రును ఈడీ అరెస్ట్​ చేసింది. ఢిల్లీలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు మనీ లాండరింగ్​ వ్యవహారంలో సమీర్​ను విచారించిన ఈడీ ఆఫీసర్లు ఆ తర్వాత అరెస్ట్​ చేశారు. లిక్కర్​ స్కామ్​లో లావాదేవీలను ఇతడే దగ్గరుండి చూసుకున్నట్లు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అనుమానిస్తున్నది. కేసులో 14వ నిందితుడిగా ఉన్న  రాష్ట్రానికి చెందిన అరుణ్​ రామచంద్ర పిళ్లైకి, సమీర్​ మహేంద్రుకు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నది. సమీర్​ అరెస్టుతో ఇంకా ఈడీ రాడార్​లో ఎంత  మంది ఉన్నారన్న చర్చ జరుగుతున్నది. ఇప్పటికే తెలంగాణకు చెందిన కొందరు లీడర్లు, లిక్కర్​ వ్యాపారులకు ఈ​ స్కామ్​తో లింకులు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. తాజా పరిణామాలు రాష్ట్ర నేతల్లో, లిక్కర్​ వ్యాపారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ప్రత్యేక బృందాలు  వారంపాటు హైదరాబాద్​లో పలు ఆఫీసులు, కొంత మంది ఇండ్లలో సోదాలు జరిపాయి. పలువురిని ప్రశ్నించాయి. ఇప్పుడు సీబీఐ, ఈడీ అరెస్టులు మొదలు పెట్టడంతో లిక్కర్​ స్కామ్ నెక్స్ట్​ ఎవరికి చుట్టుకుంటుంది..? అనేది  హాట్​ టాపిక్​గా మారింది.

లిక్కర్​ స్కామ్​లో నిందితులుగా ఉన్న 16 మందిలో సీబీఐ, ఈడీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేశాయి. 8వ నిందితుడిగా ఉన్న ఇండోస్పిరిట్‌‌‌‌ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రును ఢిల్లీలో ఈడీ అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇదే కేసులో 5వ నిందితుడిగా ఉన్న ముంబైకి చెందిన విజయ్ నాయర్‌‌‌‌ను మంగళవారం సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరికీ రాష్ట్రానికి చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైతో లింకులు ఉన్నాయి. ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ పాలసీ స్కామ్‌‌‌‌లో ఆగస్టు 17న సీబీఐ కేసు రిజస్టర్ చేసి..సమీర్‌‌‌‌ ‌‌‌‌మహేంద్రు, విజయ్‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌తో పాటు మొత్తం 16 మంది పేర్లను ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లో చేర్చింది. ఇందులో రాష్ట్రానికి చెందిన అరుణ్‌‌‌‌ రామచంద్ర పిళ్ళై 14వ నిందితుడిగా ఉన్నాడు. సీబీఐ విచారణలో బయటపడ్డ మనీలాండరింగ్ ఆధారంగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) కేసు రిజిస్టర్ చేసి.. దేశవ్యాప్తంగా సోదాలు జరిపింది. 13 మందిని విచారించింది. హైదరాబాద్​ దోమలగూడలోని గోరంట్ల అండ్‌‌‌‌ అసోసియేట్స్‌‌‌‌ చార్టెడ్‌‌‌‌ అకౌంట్స్ ఆఫీసు నుంచి సేకరించిన డాక్యుమెంట్ల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు జరిపింది. 

షెల్‌‌‌‌ కంపెనీల వెనుక..!

సీబీఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో బుధవారం ఈడీ అరెస్ట్ చేసిన సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రుకు, రామచంద్ర పిళ్ళైకి మధ్య ఆర్థికలావాదేవీలు ఉన్నట్లు ఈడీ ఆధారాలు రాబట్టింది. సుమారు 13 షెల్‌‌‌‌కంపెనీలను గుర్తించింది. వీటి ద్వారా సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు, విజయ్‌‌‌‌నాయర్‌‌‌‌‌‌‌‌తో రామచంద్ర పిళ్ళైకి ఆర్థికలావాదేవీలు జరిగినట్లు అనుమానించింది. ఈ ముగ్గురి మధ్య రూ. 2 కోట్ల నుంచి 4 కోట్లు చేతులు మారినట్లు భావిస్తున్నది. ఈ క్రమంలోనే ఈ నెల 7,16 వ తేదీల్లో హైదరాబాద్‌‌‌‌లో సోదాలు జరిపింది. దోమల్‌‌‌‌గూడలోని గోరంట్ల అసోసియేట్స్​ నుంచి కీలక ఆధారాలు సేకరించింది. పిళ్లై డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న రాబిన్ డిస్టిలరీస్, డిస్టిబ్యూటర్స్‌‌‌‌ కంపెనీల్లో అభిషేక్ రావు, ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌ ‌‌‌‌కూడా డైరెక్టర్లుగా ఉన్నారు.  ప్రేమ్​సాగర్​ సమీప బంధువు వెన్నమనేని శ్రీనివాస్​రావును ఇటీవల హైదరాబాద్​లో ఈడీ అదుపులోకి తీసుకొని ఎనిమిది గంటలపాటు ప్రశ్నించింది. రామంతాపూర్‌‌‌‌‌‌‌‌లోని సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌ షెల్‌‌‌‌ కంపెనీల నుంచి ఆధారాలు సేకరించింది. శ్రీనివాస్​రావు ఆధ్వర్యంలోని కంపెనీని ఓ నాయకురాలు ప్రారంభించినట్లు సమాచారం. దీంతో శ్రీనివాస్ రావు వ్యాపారాలతో ఆమెకు కూడా లింకులు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తున్నది.  

శ్రీనివాస్​రావును ఢిల్లీలో విచారించాక..!

వెన్నమనేని శ్రీనివాస్‌‌రావును ఢిల్లీలోని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ప్రధాన కార్యాలయంలో గత సోమ వారం అధికారులు విచారించినట్లు తెలిసింది. ఈ విచారణలో బంజారా హిల్స్, రామంతాపూర్, మాదాపూర్, కొండాపూర్, మేడ్చల్ సుచిత్ర అడ్రస్‌‌లతో రిజిస్టరైన పలు షెల్‌‌ కంపెనీలు, వాటి నుంచి జరిగిన ఫారిన్ మనీ ట్రాన్సాక్షన్లను సేకరించి నట్లు సమాచారం. ప్రముఖులకు బినామీ, షెల్‌‌ కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నవారి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఎవరి అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ ట్రాన్స్​ఫర్  అయిం దనే లెక్కలు తీసింది. ఇదే క్రమంలో బుధవారం కొన్ని గంటల పాటు సమీర్​ మహేంద్రును విచారించి అరెస్ట్​చేసింది. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.