చోటా లీడర్లను పట్టించుకోని లోక్ సభ అభ్యర్థులు

చోటా లీడర్లను పట్టించుకోని లోక్ సభ అభ్యర్థులు

శంకర్.. హైదరాబాద్ లోని ఓ బస్తీలో పేరున్ననేత. తన పలుకుబడితో 200 నుంచి 300 మందిఓటర్లను ప్రభావితం చేయగలడు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు శంకర్ ను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడ్డా రు.చివరకు భారీగా నగదు ఆఫర్ చేసి తమ వైపుతిప్పుకున్నారు. ఎన్నికల తర్వాత భారీగా నగదువస్తుందని భావించిన శంకర్ ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేశాడు. తన తరఫు నుంచి 300 వరకు ఓట్లువేయించగలిగాడు. పోలింగ్ పూర్తయింది. ఇక తనడబ్బుల కోసం ఆ పార్టీ నేతలను సంప్రదించేందుకు ప్రయత్నిస్తే వారు పత్తా లేకుండా పోయారు. ఒక్కశంకర్ నే కాదు సిటీలో కొన్ని వందల మంది చోటా,మోటా లీడర్లది ఇదే పరిస్థితి.

లోక్ సభ ఎన్నికల్లో వీలైనంత సంపాదించుకోవాలనుకున్న చోటా లీడర్ల ఆశలన్నీ అడియాశలయ్యాయి. పోలింగ్ పూర్తయ్యి ఆరు రోజులు అవుతున్నా ఇప్పటివరకు తమకు రావాల్సిన కానుకలు, బహుమతులు, నగదు ఏవీ అందకపోవటంతో చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఫలితాలువచ్చే లోపే తమకు ఇవ్వాల్సిన మొత్తాన్ని రాబట్టుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో దాదాపు అన్ని పార్టీల అభ్యర్థులు చోటా నేతలపైనే ఆధాపడ్డారు. లోక్ సభ నియోజకవర్గం మొత్తం  తిరిగేంత సమయం లేకపోవటంతో వారంతా ప్రతిగల్లీ, బస్తీ, కాలనీల్లోనూ ప్రచారం చేసేలా తమ అనుచరులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో అభ్యర్థుల అనుచరులు చాలా వరకు ఒక్కో నియోజకవర్గం లో బస్తీలు, కాలనీలు, యూత్ ఇలా ఓటర్లను ప్రభావితం చేయగలిగే చోటా లీడర్లపై దృష్టిపెట్టారు. వేల మంది చోటా లీడర్లతో బేరసారాలు సాగిం చారు. నీ తరఫున ఇన్ని ఓట్లు వేయిస్తే ఇంతఅంటూ ఓట్ల లెక్కను బట్టి వారికి కానుకలు, బహుమతులు, నగదు అంటూ హామీలు ఇచ్చేశారు. ఇప్పటివరకు నయా పైసా అందని చోటా లీడర్లు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది.స్పందిస్తేగా..ప్రధాన అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకున్నచాలా మంది అనుచరులు చోటా లీడర్లకు డబ్బుఇచ్చే విషయంలో మాత్రం ఆసక్తి చూపటం లేదు.దీంతో తాము మోసపోయామని చోటా లీడర్లు ఆగ్రహంగా ఉన్నారు.