పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఇవాళ్టితో ముగిశాయి. ఉభయ సభలు మార్చి 13కి వాయిదా పడ్డాయి. జనవరి 31 న ప్రారంభమైన తొలి విడత బడ్జెట్ సమావేశాలు మొత్తం 10 రోజుల పాటు సాగాయి. రెండో విడత సమావేశాలు మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు సాగనున్నాయి. ఈ సమావేశాల్లో పద్దులపైచర్చలు కొనసాగనున్నాయి.
ఈ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ అదానీ ఇష్యూ దుమారం రేగింది. మోడీ అండదండలతోనే ఆదానీ ఎదిగారని విపక్షాలు ఆరోపణలు చేశాయి. ఈ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. విపక్షాల ఆరోపణలకు ప్రధాని మోడీ కూడా ధీటుగానే కౌంటర్ ఇచ్చారు.
ఉదయం రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ సభను మార్చి 13వ తేదీకి వాయిదా వేశారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు అదానీ ఇష్యూపై చర్చకు పట్టుబట్టాయి. ఈ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. విపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నిరనసకు దిగడంతో సభా కార్యక్రమాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. అపొజిషన్ లీడర్ మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతుండగా అధికార పక్ష ఎంపీలు సైతం మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఛైర్మన్ ఇరుపక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆయన.. సభను మార్చి 13కు వాయిదా వేశారు.
