అక్టోబర్ 28 నుంచి కాంగ్రెస్​ రెండో విడత బస్సు యాత్ర

అక్టోబర్  28 నుంచి కాంగ్రెస్​ రెండో విడత బస్సు యాత్ర

 

  • పాల్గొననున్న ఖర్గే, రాహుల్, ప్రియాంక, డీకే శివకుమార్
  • 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న నేతలు

హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ రెండో విడత  విజయభేరి బస్సు యాత్ర శనివారం నుంచి ప్రారంభం కానుంది. నవంబర్​ 2వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సాగనుంది. రెండో విడతలో 7 పార్లమెంట్ ​నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చేయనున్నారు. 28న (శనివారం) కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్​ చేవెళ్ల పార్లమెంట్​ సెగ్మెంట్​లోని తాండూరు, పరిగి, చేవెళ్ల, 29న ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే మెదక్​ లోక్​సభ సెగ్మెంట్​లోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్​లో బస్సు యాత్రలో పాల్గొనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ 30న భువనగరి పార్లమెంట్​ సెగ్మెంట్​లోని జనగామ, ఆలేరు, భువనగిరి, 31న నల్గొండ పార్లమెంట్​ సెగ్మెంట్​లోని నాగార్జునసాగర్, నాగర్​కర్నూల్​ సెగ్మెంట్​లోని కొల్లాపూర్​లో బస్సు యాత్ర నిర్వహిస్తారు. రాహుల్​ గాంధీ నవంబర్​ 1న నాగర్​కర్నూల్​ పార్లమెంట్​ సెగ్మెంట్​లోని కల్వకుర్తి, మహబూబ్​నగర్​ సెగ్మెంట్​లోని జడ్చర్ల, షాద్​నగర్, నవంబర్​ 2న మల్కాజ్​గిరి పార్లమెంట్​ పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బస్సు యాత్రల్లో పాల్గొంటారు.  

రాష్ట్రంలోని సమస్యలపై గ్రీవెన్స్​ కలెక్షన్​ క్యాంపెయిన్​

రెండో విడత బస్సు యాత్రలో రాష్ట్రంలోని సమస్యలపై ‘గ్రీవెన్స్​ కలెక్షన్’ పేరిట కాంగ్రెస్​ పార్టీ ప్రత్యేకంగా ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలోని కాంగ్రెస్​ పార్టీ ఆఫీసుల్లో గ్రీవెన్స్​ బాక్సులను ఏర్పాటు చేసి.. ఆయా సెగ్మెంట్లలో ఉన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకోనుంది. ప్రజలు తమ సమస్యలను చిట్టీలో రాసి ఆ గ్రీవెన్స్​ బాక్సులో వేసేలా కార్యక్రమాన్ని రూపొందించింది. అంతేకాకుండా ఫోన్లలో సమస్యలు చెప్పుకునేందుకు ఓ టోల్​ ఫ్రీ నంబర్​నూ ఏర్పాటు చేయనుంది.