ఫిరాయింపు ఎమ్మెల్యేల రెండో విడత విచారణ పూర్తి

ఫిరాయింపు ఎమ్మెల్యేల రెండో విడత విచారణ పూర్తి
  • 14, 15 తేదీల్లో మరోసారి  క్రాస్ ఎగ్జామిన్


హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ కొనసాగిస్తున్నారు. రెండో విడత విచారణలో రెండో రోజైన శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై విచారణ జరిగింది. 

పోచారం తరఫున ఆయన అడ్వకేట్ హాజరుకాగా, గాంధీ తన అడ్వకేట్‌‌‌‌తో సహా అసెంబ్లీకి వచ్చి విచారణను ఎదుర్కొన్నారు. తమ క్లయింట్లు ఇంకా  బీఆర్ఎస్ లోనే ఉన్నారని.. కాంగ్రెస్‌‌‌‌లో చేరలేదని పోచారం, గాంధీ తరఫు అడ్వకేట్లు స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలను స్పీకర్‌‌‌‌కు అందజేశారు. ఇక ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారని పోచారం, గాంధీపై పిటిషన్లు వేసిన ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ లు పలు ఆధారాలను స్పీకర్ కు అందించారు. 

దీనిపై ఈ నెల 14, 15 తేదీల్లో స్పీకర్ మరోసారి క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు.మొదటి విడతలో  కాలె యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విచారణ పూర్తయింది.  రెండో విడతలో మొదటి రోజైన గురువారం ఎమ్మెల్యేలు  తెల్లం వెంకట్రావ్, డా. సంజయ్ లు విచారణకు హాజరయ్యారు. 

అలాగే, రెండో రోజైన శుక్రవారం పోచారం, అరికెపూడి గాంధీల విచారణ కొనసాగింది. ఈ నెల 14, 15 తేదీల్లో తెల్లం వెంకట్రావ్, సంజయ్, పోచారం, అరికెపూడి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయితే మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి కానుంది.