రెండో విడత వంద రోజుల్లోనే పూర్తవ్వాలె: హరీశ్​రావు

రెండో విడత వంద రోజుల్లోనే పూర్తవ్వాలె: హరీశ్​రావు

టెస్టులు చేసిన నెలలోపే అద్దాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం

హైదరాబాద్/జగిత్యాల, వెలుగు: రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జనవరి18 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలంతా పాల్గొనాలన్నారు. మంగళవారం ఆయన జగిత్యాల కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వైద్యాధికారులతో కంటి వెలుగుపై సమీక్ష నిర్వహించారు. అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందని తెలిపారు. 

మైక్రో ప్లానింగ్​సిద్దం చెయ్యాలె 

కంటి వెలుగును బాగా నిర్వహించేందుకు సూక్ష్మ ప్రణాళిక (మైక్రోప్లానింగ్)ను సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. మొదటి విడత కంటి వెలుగు 8 నెలల పాటు జరిగిందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రెండో దశ కార్యక్రమాన్ని వంద రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. అందుకు తగినట్టుగా టీమ్​ల సంఖ్యను పెంచుతున్నామన్నారు. గతంతో 827 టీమ్​లు పనిచేస్తే.. ఇప్పుడు 1,500 టీమ్​లను ఏర్పాటు చేశామని తెలిపారు. రోజువారీ వైద్య సేవలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లాల్లో 5 శాతం బఫర్ టీమ్​లను పెట్టుకోవాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సౌలతులు కల్పించాలని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని, మండల, జిల్లా, మున్సిపల్ సమావేశాల్లో కంటి వెలుగుపై చర్చించి ప్రజా ప్రతినిధుల సందేహాలను తీర్చాలని సూచించారు. మైక్రో ప్లానింగ్ పూర్తయిన తర్వాత జిల్లా ఇన్​చార్జ్ మంత్రి, స్థానిక ప్రజా ప్రతినిధులతో మీటింగులను ఏర్పాటు చేయాలని, ఏ రోజు ఎక్కడ క్యాంపు పెట్టాలన్న దానిపై ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ శ్వేత, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

55 లక్షల కండ్లద్దాల పంపిణీ

ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసిన తర్వాత ఉచితంగా 55 లక్షల కండ్లద్దాలను పంపిణీ చేయాలని మంత్రి చెప్పారు. 30 లక్షల రీడింగ్ గ్లాసెస్​, 25 లక్షల ప్రిస్క్రిప్షన్​గ్లాసెస్ (సైట్ అద్దాలు) ఇవ్వాలన్నారు. వీటిని ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలని, పరీక్షలు చేసిన నెలరోజుల్లోనే అద్దాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంపై పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో10, జిల్లా స్థాయిలో ఒక్కో క్వాలిటీ కంట్రోల్ టీమ్ లు ఉంటాయన్నారు. ప్రస్తుతానికి వైద్య సిబ్బంది కొరత లేదని, వారంలో 960 మందిని కొత్తగా నియమిస్తున్నామని వెల్లడించారు. అలాగే, పీహెచ్​సీలు, సబ్ సెంటర్ల నిర్మాణం, రిపేర్ పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.