సినిమాల్లో కూడా చూడని కొన్ని ట్విస్టులు అప్పుడప్పుడు నిజ జీవితంలో దర్శనమిస్తుంటాయి. బెంగళూరు వివాహిత హత్య కేసులో బయటపడిన సంచలన నిజాలను చూస్తే.. ఇవేం ట్విస్టులురా బాబూ.. ఏదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసినట్లుంది అనుకోక తప్పదు. ఏడాది క్రితం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న లవర్స్.. వెడ్డింగ్ యానివర్సరీ పూర్తయ్యాక.. సూసైడ్ అటెంప్ట్ చేయడం.. దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఈ స్టోరీలో ఉన్న మలుపులేంటో మీరే తెలుసుకోండి.
బెంగళూరులోని బైదరహళ్లి ప్రాంతంలో జరిగింది ఈ భయంకరమైన ఘటన. రెంటెడ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న 22 ఏళ్ల యువతి డెడ్ బాడీ లభ్యమవ్వటం సంచలనంగా మారింది. ఈ కేసుకు ఛేదించిన పోలీసులు.. ట్విస్టుల మీద ట్విస్టులు చూసి షాకింగ్ గురయ్యారు. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని చేసుకున్న ఒప్పందంలో.. యువతి చనిపోవడం వెనుక అత్యంత క్రూరమైన కుట్ర దాగి ఉన్నట్లు తేల్చారు పోలీసులు. ఘటనా స్థలంలో భార్య చనిపోగా.. భర్త అపస్మారక స్థితిలో కనిపించగా పోలీసులు కాపాడారు. ఇద్దరూ విషప్రయోగం చేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో భర్త బతికిబయటపడ్డాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మృతురాలిని భవానీ ఎస్ గా గుర్తించారు. బీఎస్సీ చదువుకకున్న భవానీ..తిగలరపల్యలోని ఒక మొబైల్ ఫోన్ షోరూమ్‌లో పనిచేస్తుండేది. బ్యాదరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తులసి నగర్‌లో, ఆర్కిడ్స్ స్కూల్ సమీపంలో ఒక అపార్టుమెంటులో నివసిస్తూ ఉండేదని పోలీసులు చెప్పారు.
- సీక్రెట్ మ్యారేజ్.. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్
పోలీసులు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, భవానీ అనే యువతి.. చందన్ అలియాస్ చంద్రశేఖర్‌తో చాలా కాలంగా ప్రేమలో ఉంది. ఇద్దరూ తమ తమ కుటుంబాలకు తెలియకుండా సుమారు ఏడాది క్రితం సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే ట్విస్ట్ ఏంటంటే.. చంద్రశేఖర్‌కు ఇదివరకే వివాహమైనట్లు తేలింది. అతనికి ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు బయటపడింది.
2026 జూన్ 13వతేదీ ఉదయం, భవానీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెళ్లి ఫోటోను బంధువులు గమనించడంతో ఈ విషాద వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకుని చంద్రశేఖర్ పోస్ట్ చేసిన ఫోటో, పలు అనుమానాలను రేకెత్తించింది. భవానీ అత్త శారద, ఆ స్టోరీ స్క్రీన్‌షాట్ తీసుకుని వెంటనే భవానీ తల్లికి సెండ్ చేసింది.
ఏదో తేడాగా ఉందని గ్రహించిన భవానీ తండ్రి శ్రీనివాస్, ఆమెకు పదేపదే ఫోన్ చేయగా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భవానీని ఒకసారి చూసి రమ్మని ఇంటి యజమానికి ఫోన్ చేశారు.
ఇంటి యజమాని, ఇరుగుపొరుగు వారు అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా.. తలుపు తాళం వేసి ఉండటాన్ని గమనించారు. బలవంతంగా డోర్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్లగా.. ఒక భయంకరమైన దృశ్యం కనిపించడంతో షాకయ్యారు. భవానీ మంచం మీద విగతజీవిగా పడి ఉండగా, ఆమె పక్కన చంద్రశేఖర్ విషం బాటిల్ తో అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, చంద్రశేఖర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
- హత్యను కప్పిపుచ్చడానికి ఒప్పంద డ్రామా..?
భవానీ తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు ప్రకారం, ఆ కుటుంబం ఇటీవలే భవానీకి పెళ్లి సంబంధాలు చూస్తోంది. వచ్చే వారంలో ఎంగేజ్మెంట్ (నిశ్చితార్థం) ఏర్పాటు చేశారు. తన కుటుంబం నిశ్చితార్థ ఏర్పాట్లను గురించి చంద్రశేఖర్‌కు తెలియజేయగా.. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసిందని అధికారులు భావిస్తున్నారు.
ప్రాథమిక విచారణ ఆధారంగా, ఇద్దరూ సూసైడ్ చేసుకోవడానికి చంద్రశేఖర్ మొదట భవానీని ఒప్పించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరూ విషం సేవించగా, భవానీ ఆ విష పదార్థాన్ని వాంతి చేసుకుని బతకాలని ప్రయత్నించింది. దీంతో చంద్రశేఖర్ ఆమెను గొంతు నులిమి చంపేసినట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత నేరం బయట పడకుండా ఆత్మహత్య ఒప్పందంలా చిత్రీకరించి ప్లాన్ చేసినట్లు తెలిపారు. అందుకోసం తను కూడా మరింత విషం తాగి డ్రామా ఆడినట్లు పోలీసులు చెప్పారు.
- ఇన్ స్టా డ్రామా..
భవానీ చనిపోయాక.. నేరం బయటపడటానికి ముందు చంద్రశేఖర్ ఆడిన డ్రామా పోలీసులకు ఆశ్చర్యానికి గురిచేసింది. మ్యాటర్ ను డైవర్ట్ చేసేందుకు భవానీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోను పోస్ట్ చేశాడని పోలీసులు వెల్లడించారు.
అపార్ట్మెంట్ రూమ్ లో.. మృతదేహాల నుంచి పురుగుల మందు వాసన వస్తున్నట్లు పోలీసులు చెప్పారు. భవానీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన చంద్రశేఖర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్, వైద్య నివేదికల తర్వాత అసలు బయటపడుతుందని బైదరహల్లి పోలీసులు తెలిపారు.
