కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్ల నియామకానికి ఓకే.. 2,255 మందిని తీసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి

కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్ల  నియామకానికి ఓకే.. 2,255 మందిని తీసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి

హైదరాబాద్, వెలుగు : సార్లు రాలే.. పుస్తకాలు ఇయ్యలే’ శీర్షికతో గురువారం ‘వెలుగు’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి సర్కారు స్పందించింది. 2023–24 విద్యా సంవత్సరానికి  కాంట్రాక్టు, గెస్టు లెక్చరర్ల నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.  ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ సెక్రటరీ రొనాల్డ్  రాస్  గురువారం జీవో 1145 విడుదల చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలన్నర అవుతున్నా.. కాలేజీల్లో గెస్ట్  ఫ్యాకల్టీల నియామకానికి అనుమతులు ఇవ్వలేదని ‘V6 వెలుగు’ తన కథనంలో పేర్కొన్నది. 

ఈ నేపథ్యంలో మొత్తం 2,255 మంది టీచింగ్  ఫ్యాకల్టీని తీసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంట్లో 1654 మంది గెస్టు లెక్చరర్లుండగా, 449 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, ముగ్గురు  మినిమమ్  టైమ్  స్కేల్ లెక్చరర్లు, 97 మంది పార్ట్ టైమ్  బేస్డ్ ఎంప్లాయీస్, 52 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు వారికి చాన్స్​ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.