పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి, నిర్బంధంపై పెరుగుతున్న ఊహాగానాల మధ్య.. ఆయన మద్దతుదారులు భారీ నిరసనలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గతవారంలో ఆయన మరణించాడంటూ వచ్చిన వార్తల తర్వాత కూడా ప్రభుత్వం ఆయనకు సంబంధించిన వీడియో లేదా సమాచారం బయటకు రానివ్వకపోవటంతో పరిస్థితులు క్రమంగా చేజారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో షరీఫ్ ప్రభుత్వం ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో సెక్షన్ 144 నిషేధాజ్ఞలను అమలు చేస్తోంది.
ఇస్లామాబాద్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నవంబర్ 18 నుంటు రెండు నెలల పాటు అంటే జనవరి 18, 2026 వరకు ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ పరిధిలో సెక్షన్ 144 అమలులో ఉంటుంది. దీంతో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడటం, ఊరేగింపులు, ర్యాలీలు, ప్రదర్శనలు చేయటం వంటివి పూర్తిగా నిషేధించబడ్డాయి. ప్రజా శాంతికి, శాంతిభద్రతల నిర్వహణకు ముప్పు కలిగించే అక్రమ సమావేశాలను నియంత్రించడం అవసరమని ఇందులో పేర్కొన్నారు.
ఇదే క్రమంలో రావల్పిండి డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన మరో నోటిఫికేషన్ లో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 3 వరకు కేవలం మూడు రోజుల పాటు సెక్షన్ 144 ను విధించారు. నిఘా కమిటీ అందించిన సమాచారం ఆధారంగా, ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలు, ప్రధాన రహదారులు, కీలక మౌలిక సదుపాయాల చుట్టూ ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు నోటీసులో వివరించారు.
స్పీడు పెంచిన పీటీఐ పార్టీ..
సుమారు నెల రోజుల నుంచి ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు వీలు దక్కకపోవడంతో ఆయన బహుశా మరణించి ఉంటారనే వదంతులు కూడా తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పీటీఐ కార్యకర్తలు ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించి నిరసనలకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను నవంబర్ 4 నుండి ఎవరినీ కలవకుండా పూర్తి ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఖైబర్ పఖ్తుంఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు కల్పించాలని డిమాండ్ చేస్తూ, పీటీఐ మద్దతుదారులు ఆంక్షలను లెక్కచేయకుండా ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఇస్లామాబాద్, రావల్పిండిలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
